పుట:కాశీమజిలీకథలు -07.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

కాశీమజిలీకథలు - సప్తమభాగము

రమానందునితో నోరీ ! ఈమోసకాఁడు మనసొమ్మూరక తినవలసినదేనా? అడుగక యూరకవచ్చితివేల. రెంటికిం జెడుదుమా? యనుటయు నేమిచేయుదుము గట్టిగా నడిగినఁ బ్రయోగము జేసి మనలఁ జంపగలఁడు. వానిచేతిలో నెప్పుడు పెట్టితిమో యప్పుడే మనసొమ్ము పోయినది. పరిచయము గలుగఁజేసికొనివచ్చిన నేదియో చేయునని చెప్పుచున్నాఁడుకాదా ? అప్పుడే చూతము అని వాఁడు వానికి సమాధానము జెప్పెను. అప్పుడు చిదానందుఁడు యిఁక మనము నిత్యము నామత్త కాశినులు చేయు కృత్యములఁ బరీక్షించి పిమ్మటఁ జేయఁదగినపని యాలోచింతము. రహస్యముగా వారి వెనువెంటఁ దిరుగుచుండుమని బోధించిన రమానందుఁ డట్లుచేసి యొకనాఁడు చిదానందునితో నిట్లనియె.

మిత్రుఁడా ! నిన్న నే నొకవిశేషము దెలిసికొనివచ్చితిని వారిలో రెండవ యోగిని నిన్న బ్రహ్మానందయోగియొద్దకు వచ్చి వసిష్టమహర్షి యాశ్రమమునకు మార్గ మెట్లనియు నతని యాశ్రమమునకుఁ బోవలయుననియు నడుగుచున్నది. దారి చూపువారికిఁ గొంత ధనసహాయము చేయుదునని సూచించినది. ఆ యోగి వృద్దుండైనను గడు టక్కరియగుట నా ముని యిప్పు డెందున్నవాఁడో విచారించి తెలియఁ జేసెద రెండు మూఁడు దినములలో రమ్మని యుత్తరము జెప్పెను. ఇదే సమయము నే నొక వ్యూహము పన్నదలంచి యుంటి. విరివిగ సొమ్మువ్యయ పెట్టవలసియున్నది. నీ వంగీకరింతువేనిఁ గార్యసాఫల్యముగాఁగలదు అని పలుకుటయు చిదానందు డిందుల కెంత సొమ్ము వ్యయమైనను సగబాలు భరింతు గార్యము నెరవేరు తెరవాలోచించుమని యుత్తరము చెప్పెను. అప్పుడు రమానందఁడు వాని చెవిలో నేదియో చెప్పెను. చిదానందుం డంగీకరించెను.

అని యెఱింగించువరకు వేళ యతిక్రమించుటయు మణిసిద్దుండు అవ్వలికథఁ బై మజిలీయం చెప్పఁదొడంగెను.

106 వ మజలీ.

బ్రహ్మానందయోగికథ

రోహిణీ ? మన మీ ప్రయోగము వచ్చి పది దినములైనది. తీర్థసేవ గావించి కృతార్ధుల మైతిమి. పయనము మాట యేమి జేసితివి కాదు యోగులు చాలమంది గలరు. వారు దేశసంచారము చేయుదుందురు. వారికి -------------- మార్గము దెలియకపోదు. ఎవ్వరినైన యడిగితివా అని ప్రయోగమున జితపతి ------------- రోహిణితో ముచ్చటించిన నది యిట్లనియె.