పుట:కాశీమజిలీకథలు -07.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

కాశీమజిలీకథలు - సప్తమభాగము

పుష్పములచేత లక్ష హోమములు జేసినచో మహాపతివ్రతయైనను శీఘ్రముగా మీ యొద్దకు రాఁగలదు. అట్లుచేయుఁడు పోపొండని యామంత్ర ముపదేశించి యతండు వారినం పెను.

ఆయోగు లామంత్రము సాంగముగా గ్రహించి యమునానదింగ్రుంకి నియమముగా రెండులక్షలు జపించి హోమముజేసి మూడు రాత్రులలో వ్రతసమాప్తి గావించిరి. నాలుగవనాఁటి రేయి తప్పక యప్పడఁతి వచ్చునని నిశ్చయించి మారుమూలనున్న నొకపర్ణశాలలో మంచిశయ్య గల్పించి తగురీతి నలంకరించి యామిందఁ బోణిఁరాక నిరీక్షించుచు వారిట్లు సంభాషించుకొనిరి.

రమానందుఁడు - చిదానందూ ! ప్రొద్దెంతపోయినది?

చిదానందుడు - ఇంకను జాము ప్రొద్ధయినను బోవలేదు. తొందరపడియెద వేమిటికి? అర్ధరాత్రమునగాని రాదలి మనోహరదాసు చెప్పినమాట మరచితివా?

రమా - అబ్బా! యీప్రొద్దెంత సేపటికిఁ దరుగకున్న దేమి?

చిదా - సమయము కావచ్చినదికాని ముందు నీవా? నేనా?

రమా -- అచిన్నది తొలుత నెవరిని పిలుచునోవాఁడు. మంత్ర మిద్దరము. జపించితిమిగదా.

చిదా - సెబాసు లెస్సగా జెప్పితివి. అదియే బాగున్నది.

రమా -- చూడు. చూడు. అమూల నెద్దియో సద్దగుచున్నది. అర్దరాత్రము దాటిపోయినది.

చిదా - గాఢాంధకారములో నేదియుం దెలియదు (నిదానించి) అవును యెవ్వరో వచ్చుచున్నట్లేయున్నది.

రమా - రాక గుండెలున్నవియా? మనముజేసిన జపముసామాన్యమా? మనోహరదాసుమాత్రము మంచి తంత్రవేత్తసుమీ?

చిదా -- అది‌ యెఱింగియేకాదా? నేనువానియొద్దకు రమ్మంటిని.

రమా -- అవును ఈయపాయము జెప్పినవాఁడవు నీవే.

చిదా - అదిగో వచ్చుచున్నది మాట్లాడకు బోటీ? ఇటురా ఇటురా. మాపర్ణశాల యిక్కడనున్నది.

రమా - రమానందు డిక్కడ నున్నాడు. ఇటురా?

చిదా - నేను జిదానందుఁడ నిందున్నాను. ఈలాగున.

రమా - దాపునకు రానిదే తొందరపడియెద వేమిటిక?

చిదా - నీవు ముందుగాఁ బిలిచితివికాదా?