పుట:కాశీమజిలీకథలు -07.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

284

కాశీమజిలీకథలు - సప్తమభాగము

ఇది యొక్కటియే సురస యపరాధనియని తెలియఁజేయు చున్నది అగ్నివర్మ యల్పునివరించి యమున యిట్టి కల్పనజేయుచున్నదని చెప్పుచున్నాడు. కావున నిందలి నిజానిజంబుల మీరే విమర్శించి మీకుఁదోచిన సంగతులు రేపు చెప్ప వలయునని యానతిచ్చి చక్రవర్తి యంతటితో సభచాలించెను.

అందరును లేచి తమతమ నెలవులకుం బోయి యావిషయమే విమర్శించుచు దేవవర్మయొద్దకు వచ్చి తమకు దోచిన విషయముల నడుగుచు నగ్నివర్మను శంకిం చుచుఁ బలుదెరంగులఁ దలంచుచు నా రాత్రి వేగించిరి.

మరునాఁడు యధాకాలమునకు నృపతులందఱు సభనిండించిరి. చక్రవర్తి భార్యతోఁగూడ సింహాసన మలంకరించినతోడనే రాజులందఱులేచి నమస్కరించిరి. పిమ్మటఁ జక్రవర్తి లేచి నిలువంబడి ఓమహాశయులారా! రాత్రి జక్కగా విమర్శించి యుందురు. మీకుఁ దోచిన న్యాయంబుల జెప్పుఁడని యడిగిన నేమనిన నేమి యపరాధ మోయని భయపడుచుఁ దొలుత నెవ్వరును మాటాడిరికారు.

అప్పుడు వజ్రదత్తుఁడు లేచి మహారాజా! దేవవర్మ యబద్ధమాడువాడుకాడు. తాను గన్నులారఁ జూచితిననియుఁ జెవులారావింటిననియుం జెప్పుచున్నాడు. అతని మాట లేల నమ్మగూడదు?

అతండు బ్రాహ్మణపక్షపాతియైనట్లు మొదట గ్రామాధికారి పైన మండలాధి పతిపైనను వ్రాసిన వ్రాతఁలే చెప్పుచున్నవి. తనమనసునకు నచ్చినంగాని యట్టితీరుపు చెప్పఁడు. కావున సురసయే దోషురాలని నాకుఁదోచినదని చెప్పెను. చక్రవర్తి యభి ప్రాయమెట్లున్నదో యట్లు చెప్పవలయునని కొందఱు తలంచిరికాని యతనిహృదయ మెవ్వరికిం దొరకినదికాదు వజ్రదత్తుఁ డేదియో తెగించి జెప్పెను. కావున నతనితో నేకీభవించితిమని పెక్కండ్రుచెప్పిరి.

దేవవర్మయందు వైరముగల మఱికొందరు రాజులు దేవవర్మకు నల్లునియందుఁ బక్షపాతము౦డక మానదు కావున నతనిమాటలు మన్నింపవలసినవికావు ఇతరసాక్ష్యము లేదు. సురసదే న్యాయము అల్పుఁడే యపరాధియని చెప్పిరి.

అప్పుడు చక్రవర్తి వజ్రదత్తుఁజూచి నీవు లెస్సగాఁబలికితివి గాని నీకు సంతతి కలదా! యని యడిగిన నతండు మొగమున వెల్లదనంబు దోప మహారాజా! కలిగినను లేనివాడఁనై తిని. జంగమదాసను కొమరుడుదయించెను. వాఁడు గురుతిరస్కా రంబుజేసి వెఱ్ఱివాఁడై దేశముల పాలై తిరుగుచున్నాడు. దేశమంతయు వెదకించితి ఎందును వానిజాడ గనఁబడలేదని తనకథ యెఱింగించెను.

పిమ్మట, జక్రవర్తి పీఠమునుండి లేచి యోభుపతులారా? ఇంతదనుక మీమీ చరిత్రము లన్నియుం జెప్పితిరిగదా? నేనెవ్వడఁనో యెట్లుమీకుఁ జక్రవర్తినై తినో మీరు నుం దెలిసికొనఁ దగినదియేకదా వినుండు. భగవంతుని విలసితములు కడువిచిత్ర ములు తృణమును మేరువునుగా, మేరువును తృణముగాఁ జేయుచుండును.