పుట:కాశీమజిలీకథలు -07.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూర్యవర్మ కథ

283

వులపాలు గావించెను. దైవ వశంబున నాకుమారుఁడును నల్లుఁడును బ్రతికి అడవిలో మాకెదురుపడిరి. మేము తిరుగ మానగరము జేరుకొని యొకవైశ్యునియింటిలో నుండగా వికటదంతుని మూలమునఁ దెలిసికొని చెరసాలం బెట్టించి చిక్కులఁ బెట్టుచున్నాఁడు అని తమ వృత్తాంతమంతయు నారాజులెల్ల వినఁ జక్రవర్తికిఁ దెలియ జేసెను.

అప్పుఁడు చక్రవర్తి చంద్రగుప్తుని దాపునకు రప్పించుకొని రాజా! నీకు బిల్ల లెందరు?

చంద్రగుప్తుడు - ఇద్దరు మగవాండ్రు, యిద్దరు ఆడువాండ్రు.

చక్రవర్తి - వారి పేరులేమి?

చంద్ర - లవుఁడు, కుశుఁడుమగవారు. రతి విరతులాడువాండ్రు.

చక్ర. - వారందరికి వివాహము గావించితివా?

చంద్ర - చేసితిని.

చక్ర - నీయల్లుం డెవ్వరు?

చంద్ర - పెద్దవాఁడీసుకుమారుఁడు రెండవకూఁతురు, నల్లుఁడు మాయొద్ద లేరు. దేశాంతర మరిగిరి.

చక్ర - అల్లుఁడే రాజకుమారుఁడు.

చంద్ర - రాజపుత్రుఁడు కాడు. సామాన్యుఁడే.

చక్ర - సామాన్యుఁడనఁగా సామంతుఁడా యేమి?

చంద్ర - కాడు ఒక జంగమదేవర.

చక్ర - శివశివా! అదియేమి యన్యాయము. ఆ జంగమదేవరకిచ్చితివేమి?

చంద్ర - అందులకొక కారణమున్నది దేవా! (అని యావృత్తాంతమంతయు నెఱింగి౦చెను.)

రాజులందరు విస్మయమునజెందిరి. పెద్దకుమారుఁడు విరక్తిజెంది దేశముల పాలై పోయెనని చెప్పెను. చక్రవర్తి, సరే నీ చరిత్రము పిమ్మటే విమర్శింతుము. నీపీఠముపైఁ గూర్చుండుము. అని నియమించెను. అల్లుఁడును. కొడుకును ఆపీఠమును జేరియున్న పీఠములపైఁ గూర్చుండిరి, రతియు, ధర్మరతియుఁ జక్రవర్తి యానతి వడువున నాసభలోనే యొకమూల స్త్రీలకు నిరూపింపఁబడినగదిలో వచ్చి కూర్చుండిరి.

అప్పుడు చక్రవర్తి అగ్నివర్మను, సురసను, దేవవర్మను, అల్లుని బిలిపించి పీఠముదాపునకు రప్పించుకొని వారువారుజెప్పిన సాక్ష్యములును మాటలు‌ను వ్రాసి కొని వెనుక వ్రాసినవానితో సంప్రతించి పరస్పరభేదముల నిరూపించుచు సామంతరాజుల నుద్దేశించి యిట్లనియె. ఓమహామతులారా! మీరందరు వీరిచెప్పిన మాట లన్నియును వింటిరిగదా! గ్రామాధికారియు మండలాధిపతియు దేవవర్మయు నీయల్పుని నిరపరాధిగా నెంచిరి. సురసయందే తప్పున్నదని నిశ్చయించిరి. అందు లకుఁ దగిన సాక్ష్యమేమియుఁ గనంబడదు. దేవవర్మకూఁతురు యమున తండ్రికి గుప్తముగానల్పుని సురస ప్రార్థించిన విషయము జూపినట్లుగాఁ జెప్పుచున్నారు.