పుట:కాశీమజిలీకథలు -07.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36]

సూర్యవర్మ కథ

281

దెచ్చిన అభియోగములో నీవతనియందుఁగల పక్షపాతంబున వానిని శిక్షింపక విడిచి యల్లునిఁ జేసికొంటివనియు నందులకై అతండు సూర్యవర్మయొద్ద మరలఁ దగవు చేయక నీయల్లుని నపరాధివోలె సంకెళులు దగిలించి పంపమని మీకు నాజ్ఞాపత్రికలు వ్రాయగా దిరస్కరించినందులకుగాను పెద్దయుద్ధము జరిగినదిగదా? అందు సూర్య వర్మ నిహతుం డయ్యెను. వారిస్థానమందు నేను రాజుగావచ్చి పీఠ మెక్కితిని. ఇప్పుడా బ్రాహ్మణుడు వచ్చి అయ్యభియోగము నన్ను విమర్శింపమని కోరుచున్నాడు. ఇందులగుఱించి మీకు యదార్దము తెలిసినట్లు మీరువ్రాసిన పత్రికలలో నున్నది ఇప్పుడు మఱియొకసభ జేయుచుంటిని. ఆసభకు సామంతరాజునెల్ల రప్పించు చున్నాను. అందు రాజులలో రాజులకుఁగలిగిన తగవులను విమర్శించి యందఱి యభి ప్రాయములం గైకొని న్యాయమెట్లో యట్లు కావించువాఁడ ఇందులకుఁ మనలోమనకు విరోధ మవసరములేదు. కావున నాసభకు మీరును, మీయల్లుఁడును దయచేయవల యును స్త్రీసహితముగా రావచ్చును. అందరుకును దగినబస లేర్పరుపఁబడి యున్నవి. మీమీ బిరుదములతో, వాహనంబులతో రావచ్చును.

అనియున్నపత్రిక జదివికొని, యాహా? క్రొత్తచక్రవర్తి యెంత మంచివాఁడు. ఎంతన్యాయవేత్త. ఎట్టి వినయశీలుఁడు. అని పొగడుచు దేవవర్మ యమునతో నీవు గూడ నాసభకురమ్ము ఆమహాసభలో సురసయొక్క యౌచిత్యము దెలియజేయుదము అనుటయు నామె యంగీకరించినది యల్పుఁడును సమ్మోదించి సభనాఁటికి బాట లీపురంబున కఱిగి యందుఁ దమకై యేర్పరచిన నెలవున వసియించెను.

మఱియు నతని యధికారముక్రింద సామంతరాజులెల్లఁ దమతమ సేనలతో వాహనములతో మంత్రులతో వచ్చి నగర మలంకరించిరి. వజ్రదత్తుఁడు విశోకునిచేఁ జంద్రగుప్తాదులు క్రమముగా బద్ధులై చెరసాలం బెట్టఁబడిరని వైశ్యునిచే విని యాయ న్యాయ మాసభలో విమర్శింపుఁడని‌ చక్రవర్తికిఁ బత్రికాముఖంబునం దెలియఁజేసెను. దానంజేసి చక్రవర్తి చంద్రగుప్తాదులతో నాసభకురమ్మని విశోకుని కాజ్ఞాపత్రిక బంపియున్నకతంబున నావిశోకుఁడు చింతావ్యాకులచిత్తుడై వారితోఁగూడ నాసభనాఁటి కావీటికి జనుదెంచెను.

మఱియుఁ గొందరురాజులు తమలోఁ దమకుగల తగవులన్నియు నాసభలో విమర్శింపఁబడునని సంతసించుచుఁ దగిన సన్నాహములతో నానగరమున కరు దెంచిరి.

నిరూపిత దివస౦బున సమున్నతవిశాలంబగు సభాభవనంబునఁ జక్రవర్తి పీఠములకుముంగల రెండుశ్రేణులుగా వేయఁబడిన పీఠములపై సామంతరాజులు తమ తమ యధికారము ననుసరించి తారతమ్యముగాఁ గూర్చుండిరి ఆపీఠమునకు వెనుకటి పీఠములఫై వారికుమాళ్ళు, బంధువులు, మిత్రులు గూర్చుండిరి. మఱియుఁ బండితులు హితులు పురోహితులు లోనగువారు సభ నలంకరించిరి. చక్రవర్తియు భార్యయు వచ్చి పీఠ మెక్కినతోడనే సామంతులెల్ల లేచి కరతాళములు వాయించుచు జయజయ