పుట:కాశీమజిలీకథలు -07.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

278

కాశీమజిలీకథలు - సప్తమభాగము

డక్కడఁ బల్లెలయందు నివసించి దొరకిన యాహారమువలన దేహమును గాపాడుచు మనదేశమునకు దారి దెలిసికొని మెల్లగా నడుచుచు నీ మార్గమున వచ్చుచుంటిమి. ఇందుమీరు గనంబడితిరి ఇదియే మావృత్తాంతము మమ్ముఁ బ్రేతంగాఁదలంచిమీరు బెద రితిరి. మేమట్టివారమని తలపవలసినదే కాని ఆచిన్నది మాకు దైవములాగున వచ్చి విడిపించినది. అని యావృత్తాంత మంతయు నెఱింగించిన విని యారాజు వారిం గౌఁగ లించుకొని ప్రహర్ష సాగరంబున మునింగెను. రతియు అతిశయమగు విస్మయముతో వారి పాదంబుల కొరగి హృదయపరితాప మెఱింగించెను. ధర్మరతి మందహాసము గావింపుచు నీశ్లోకము చదివినది.


శ్లో. పనె రణె శత్రుజలాగ్ని మథ్యె మహార్ణవే పర్వతమస్తకె వాః
    సుప్తంప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని.

మీపూర్వకృత పుణ్యమే మిమ్ము రక్షించినది. అని పలికి మఱియు నిట్లనియె. మీరు ప్రకృతి నిరతులుగారా? సర్వము స్వశక్తి చేతనే నడుచునని చెప్పుచుండువారె ! ఇప్పుడామాట లేమైనవి. ఇప్పుడైన పెద్దల మాటలయందు విశ్వాసముంచుదురా ? అని పలికిన నామె వెఱ్ఱిదానిగాఁ దలంచి అందులకేమియు నుత్తరమిచ్చిరికారు.

అప్పుడు సుకుమారుఁడు శోకగద్గద కంఠుండై మహారాజా! విశోకుఁడు మిమ్ముఁబురినుండి లేవఁగొట్టెనా? మంత్రులెవ్వరును సహాయము చేయలేదా? అయ్యో ! యీయాఁడువాండ్రతోఁ గూడికొని విపినంబుల నెట్టికష్టముల గావించితిరి. అచ్చట వృత్తాంతము మరల నొడువుఁడు క ర్తవ్యమాలోచింతమని పలికిన విని చంద్రగుప్తుఁడు కన్నీరుగార విశోకుఁడు మనపై నెప్పుడు నీసుబూనియేయున్న వాఁడుగదా? సైన్యా ధిక్యము దలంచియు మీశౌర్యముదలంచియు నివురుగప్పిన నిప్పువళె నణఁగియున్నాడు. సైన్యమంతయుఁదీసికొని మీయిరువురును చక్రవర్తికి సహాయముపోయి మడిసిరనువార్త వినినతోడనే పయ్యెరకు రవులుకొను నగ్నివలె విజృంభించి సేనలతో వచ్చి పట్టణము చుట్టవేసెను. మంత్రులు మీకుఁ బలాయనమే మానరక్షణము అని నాకుఁదెలియజేసిరి. యుద్ధముసేయుటకు సేనలులేవుగదా? విశోకోుఁడు గడు దుర్మార్గుఁడు స్త్రీలఁజెరబట్ట గలఁడు అని బెగడుజెంది కట్టుగుడ్డలతోఁ గోటవిడిచి మారుదారింబారిపోయివచ్చితిమి. నాకోడలు పుట్టినింటకడ నుండుటచే నికాయాపద దప్పినది. మేము మువ్వురము అడవులంబడి యాకిలములుదినుచుఁ దిఱుగుచుంటిమి రాజ్యమయినం బోవుఁగాక మీరు గనంబడితిరి. ఇదియు పదివేలు. ఇందొకచో నాశ్రమము గల్పించుకొని తపంబుగావిం తము. ఇంటికిఁ బోవలదని పలికిన ధర్మరతి పరమానంద భరితహృదయయై యదియే కర్తవ్యమని చెప్పినది.