పుట:కాశీమజిలీకథలు -07.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

276

కాశీమజిలీకథలు - సప్తమభాగము

లేదు. ఇప్పుడు విచారమునులేదు ఒకరికొకరి సంబంధములేదు. సంబంధము లట్టివే కావున అస్థిరములని యెఱింగినఁ దద్వియోగము దుఃఖమునకుఁ గారణము కానేరదు. మనము తపోవనంబునకుఁ బోవుచుంటిమి. విచారింపవలదు. అదియునుంగాక మన పుణ్యము మంచిదైనచో నిందును మేలు గలుగ వచ్చునని యపదేశించినది.

రతికి మతిపోయినది. తల్లిమాట లేమియు లక్ష్యము సేయదు ఆమె పిచ్చిదని యాయువతి అభిప్రాయము. అట్లు శోక సాగరమీదుచు వారు మువ్వురు అవ్వన మధ్యమునుండి పోవుచుండ నొకదండ సుకుమారుఁడును గుశుఁడును నెదురుపడిరి.

దూరమందుండగనే గురుతుపట్టి చంద్రగుప్తుఁడు అమ్మా రతీ! అదిగో నీమగఁడు వాఁడే నీసోదరుఁడు వీరిద్దరు మృతినొంది పిశాచములై అడవులఁ దిరుగు చున్నారు కాఁబోలు. అయ్యో ? వీరు దుర్మరణము నొందుటచే వీరికిట్టి పిశాచత్వము వచ్చినది. ఇప్పు డేమి చేయఁ దగినది ఏమికావలసిన అది పెట్టఁగలము. మనమీదఁ బడి చంపరు గదాయని బెదురుగదురఁ బలికిన విని రతి నాయనా ? మనయందు వీరికి బ్రీతియుండదా ? వెనుకటిప్రేమ యంతయు మరతురా యేమి మనము వచ్చితి మనియే వీరు చూచుటకు వచ్చిరని తలంచుదును. నాకేమియు భయములేదు. దాపు నకుఁబోయి మాట్లాడెదను జూఁడుడు అని ముందరకు నడవఁబోయిన వారించుచుఁ దండ్రి అమ్మా తొందర పడకుము మృతినొందిన తరువాత ప్రేమలెట్లుండునో తెలియదు. పిశాచములైన వారికి వెనుకటిస్మృతి యుండదు. నిలునిలు నిదానించుమని పలుకుచు గదలక మెల్లగా నొక చెట్టుక్రిందఁ గూర్చుండెను.

ఇంతలో వారిద్దరును నాచెట్టు కిందకువచ్చి కూర్చుండి చంద్రగుప్తుని మీదేయూ రని అడిగిరి. అయ్యో! బాబులారా ! మీకిట్టి యవస్థ పట్టినదా! ప్రేతలైపోయితిరా? మీకేమికావలయునో చెప్పుఁడు అని గద్గదకంఠముతో నడిగినవారు వారిం గురుతు పట్టలేకపోవుటచే నెందులకో యేడ్చుచున్నారని మఱేమియుఁ బ్రశ్నవేయకయందే కూర్చుండిరి.

రతి నిలువలేక హా ప్రాణనాధా నీవు గతాసుడవై పిశాచరూపము ధరించి తివా మీ పాదము లిట్టు ముందరకే యున్నవేమి ? పిశాచములకు మడుమలు వెనుక కుండునని చెప్పుదురే? మీరిచ్చటికేల వచ్చితిరి. అని అడిగిన వారు మీరెవ్వరోముందు జెప్పిన మా వృత్తాంతము వెనుక జెప్పెదమనిన రాజు ఇట్లనియె.

అయ్యా ! భూతములారా ! నేనొక దౌర్భాగ్యుఁడను నాకు వెనకటి జన్మ మున రాజ్యము గలదు. అల్లుఁడును కొడుకు చక్రవర్తికి యుద్ధములో సహాయము వెళ్ళి బహ్మరాక్షసునిచేఁజంపఁబడిరి. సైన్యముతో నావీరులిద్దరు సమయుట దెలిసి