పుట:కాశీమజిలీకథలు -07.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

272

కాశీమజిలీకథలు - సప్తమభాగము

అందు దేవవర్మ యల్లుఁడఁట. తురగారూఢుండై కరంబున గరవాలంబు బూని మెఱపుతీగెయంబోలె ఖడ్గకాంతులు కన్నులకు మిరిమిట్లు గొలుప విచిత్ర గతులఁ బరిభ్రమించుచుఁ దమబలంబుల నిలిపి శత్రుబలంబులఁ జెల్లెలికట్టవోలె నాపుజేసెను. మన యువరాజుగారు తత్తురగవల్లువిశేషంబు లరసి యందలిమర్మంబు దెలిసికొని నినతురగమును వానిపైకుఁ దోలి కలియఁబడి యుద్ధము చేయుచుండెను. ఇరువురు పెద్దతడవు పోరిరి. తక్కినయోధులెల్లఁ బోరుమాని తద్విశేషములఁ జూచు చుండిరి. జయాజయంబులు తేలలేదు ఇంతలో సాయంకాలసమయమగుటఁ బోరు చాలించి యిరువాగువారును నాయుధంబుల విడి కాల్యకరణీయంబులు దీర్చుకొనిరి. దేవా! యింతటివట్టుచూచి వచ్చితిమి. నేటిఁవిశేషములివి. రేపు వేగులవాండ్రువచ్చి చెప్పగలరు ఈపాటికిశత్రువులు లొంగియుందురు ఆవీరుని కతంబునంగాని కానిచో నిన్ననే కోట వశమైపోవును. రాత్రి గూడ మరల యుద్ధముచేయఁ బ్రయత్నించు చున్నారని యక్కడి కథలెల్ల జెప్పినవిని చంద్రగుప్తుఁడు తదనంతర వృత్తాంతము విన మిక్కిలి తొందరపడుచుండె

మఱునాఁడు యధాకాలమునకు వార్తాహరులు వచ్చుటయు సంభ్రమముతో నాఱేఁడు మనపక్షమునకు జయము గలిగినదియా! యని యడిగిన వాండ్రు దైన్యము దోప మహారాజా! అంతయు వ్యర్థమైనది భూమండలమున నిట్టివిపరీత మెప్పుడును జూచి యెరుంగము. వినుండు. పగలెల్ల పోరి యంతటితో విరమింపక క్రమ్మర రాత్రి యుద్దము ప్రారంభించిరి. మనకు సేనలు చాలగలవుగదా యనుగర్వమే యింత ముప్పుదెచ్చినది.

రాత్రి యుద్ధము ప్రారంభించిన రెండుగడియలకు నొకమహాభూతంబు శత్రుసేనలోఁ జేరి సింహనాదంబు జేసినది. మనబలంబులన్నియు మూర్ఛవోయి కొంతవడికిఁ దెప్పిరిల్లి చూచినంత నాభూతంబు గొండగుహవలె భయంకరమైన నోరు దెరచుకొని యగ్నిజ్వాలవలె నాలుకవ్రేలాడ జీమలవలె మనబలంబుల బాదంబుల రాచుచు దోమలవలె జేతులం జరచి నోటవైచుకొనుచుండెను.

మహారాజా! కుంభకర్ణుని జూచిన వానరులవలె సామంతరాజులు వీరయోధులు కాలుబ౦టులు పికాపికలై యాయుధములు విడిచి వాహనంబుల నుఱికి కిరీటములుజార బట్టలువీడ జుట్టులుగొట్టుకొనఁ ఒకరికొకరుజెప్పక పలకరింపక గాలికొలఁదిపారఁ దొడంగిరి. శత్రుసేనలో నొక్క౦డును జెక్కుచెదరక యుక్కు మిగిలి మనయోధుల వెక్కిరించుచుండిరి. పెక్కేల అర్ధరాత్రమగునప్పటికా రణాంగణము శూన్యమై పోయినది కొందఱు మడిసిరి. కొందరు పారిపోయిరి. కొందరు వాని నోటిలోఁబడి