పుట:కాశీమజిలీకథలు -07.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సుగతుని కథ

269

రాజు పుత్రు బ్రతిమాలికొని అతికష్టమున నయ్యోగియొద్దకుఁ దీసికొని పోయెను.

రాజపుత్రుఁడు రాజసభాభవనంబున నతనికి నమస్కరింపక తిరస్కార భావమున నందుఁ గూర్చుండెను.

జంగమదేవర - నీ పేరెవ్వరు ?

రాజపుత్రుడు - గడ్డముపెంచినతోడనే సర్వజ్ఞత్వము బలియును ఎల్లవారిని నీవు నీవు అని పిలుచుచుందురు గదా.

రాజు - బాబూ నీవు వీరివరంబుననే పుట్టితివి వారు నిన్ను మీరనరాదు పేరు చెప్పుము.

రాజపుత్రుఁడు - పేరా ? జంగమవాసి

రాజు -- అయ్యో ? అట్లుకాదురా జ౦గమదాసురా

రాజపుత్రుఁడు - మీరుపెట్టినపేరది నేనుబెట్టుకొన్న పేరిది

రాజు -- వీరికి నమస్కరింపుము

పుత్రుఁడు - మీరు నమస్కరించితిరి చాలదా. దానికతనమీకు వచ్చినలాభము మీరేకుడువుఁడు నాకు బంచి పెట్టనక్కరలేదు

జంగమదేవర - నీకుఁ దిగినఫలము నీకును బంచిపెట్టెదము కావలమయునా !

పుత్రుడు - (పరిహాసముగా) ఏదోకొంచెము దయచేయుఁడు.

జంగమదేవర - చంకనుజోలియు నొకచేత గంటయు నొకచేత శంఖమును బూని జంగమవేషమునీచేతవేయించి బిచ్చమెత్తింతును చూడుము.

పుత్రుఁడు - అట్టి వేషము నాచేత వేయింతువేని నీవు నిజమైన జంగమ దేవరవే.

జ౦గమ - సరే. యింటికిఁబొమ్ము.

రాజు - మహాత్మా! వీనిమాటలు పాటింపవలదు. మీకు బుత్రుఁడీతడు. నయ శిక్షవిధింపవలయునుగాని భ్రష్టుఁజేయఁదగదుసుఁడీ

అని అతని నుతించుచుండెను. కుమారుఁడంతకుముందేయచ్చోటువాసి నిజనివా సంబునకుఁబోయెను. ఉత్తములఁ దిరస్కరించినపాతక మూరకపోవునా? రాజపుత్రుఁ డింటికిఁ బోయెనో లేదో అంతలో దుర్భరమగు శూలనొప్పి యావిర్భవించి గిలగిల కొట్టుకొనఁ దొడంగెను. పెక్కండ్రు వైద్యులువచ్చి చికిత్సలు గావించిరి. ఇ౦చుకయుఁ బ్రయోజనములేకపోయినది. అప్పటికి వానిచిత్తము పశ్చాత్తాపముజెందినది. జంగమ దేవరమహిమవలనఁ దనకాబాధగలిగినదని నిశ్చయించి రాజపుత్రుఁడు తండ్రిని వేడి కొనియెను.