పుట:కాశీమజిలీకథలు -07.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

268

కాశీమజిలీకథలు - సప్తమభాగము

పుత్రుండు - నీవెవరివరంబునం బుట్టితివో చెప్పుము.

రాజు - పరిహాసమాడకుము నేనెవ్వరివరంబునం బుట్టిననేమి ? నాకుఁ గాలము గడిచినదిగదా.

పుత్రుడు - నాకునుగొంత గడచినది. ఈలాటి వెర్రిమాటల నా యొద్దజెప్ప కుము. ఆయోగి యెవరిమూలమునఁబుట్టెను. జన్మమునకుఁ తల్లిదండ్రులేమూలము. వేరెవ్వరునుగారు.

రాజు - అయ్యో ? ఆయోగి అట్టివాఁడుకాడు మహానుభావుఁడు. ద్రవ్యాశలేని వాఁడు.

పుత్రుఁడు - ద్రవ్యాశలేనయట్లే అభినయించుచు బైరాగులు మీవంటివారిని మోసము చేయుచుందురు. మీరు వట్టి అమాయకులుగదా ?

రాజు -- నాయనా! నీవు చిన్నవాఁడవు పెద్దల నధిక్షేపింపకుము అట్లుచేయ నిచో మోసమువచ్చునని కూడ చెప్పియున్నాఁడు సుమీ? తప్పక నీవా వేషము వహింపకతీరదు.

పుత్రుఁడు - చాలు. చాలు. ఇప్పుడు జంగమ వేషము వేయమనెదరు. రేపు మాదిగవేషము వేయమనగలడు. వానిమాట వడువున నడువవలసినదా యేమి ?

రాజు -- బాబూ ! మొదటనే యాయనచెప్పెను. నడువనిచో ముప్పువాటిల్లును సుమీ.

పుత్రుఁడు - అదియేమియో చూతునుగదా ?

ఇఁకజెప్పవలసినదేమియున్నది. తండ్రితో వాఁడు పెద్దతడవు వికటవాదము గావించి అట్టివేషము వేసికొనుటకు అంగీకరింపడయ్యెను. రాజు చేయునదిలేక విచా రింపుచుండెను. కొన్నిదినములు జరిగిన వెనుక దేశాటనము జేయుచుచేయుచు నాజంగమదేవర దైవికముగా నాయూరువచ్చి దేవాలయములో వసించెను.

ఆవార్తవిని భూభర్త అత్యంతభయభక్తి విశ్వాసపూర్వకముగా నతనియొద్ద కుంబోయి అడుగులఁబడి మహాత్మా! నన్ను గృఁతఘ్నుఁగాదలంతురేమో అట్టి వాఁడనుగానుఁ మీరునాకు దుడుకుకొడుకుందయజేసితిరేల ! వాఁడు నాచెప్పినట్లు వినుటలేదు. ఏమికతంబుననోవికటవాదియయ్యె. మీయొద్దకు రప్పింతు మందలింపుఁ డని వేడుకొనియెను.

అజంగమదేవర మందహాసముగావింపుచు నందులకు మీదంపతులు హేతు భూతులు చిత్తచాంచల్యంబునంజేసి వాఁడట్టి వాఁడయ్యెనని పలికి వాఁడు దనయొద్ధకు వచ్చుట కెట్టకే నంగీకరించెను.