పుట:కాశీమజిలీకథలు -07.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సుగతుని కథ

267

జయశంకర! మృత్యుంజయ! యనియుచ్చరింపుచు రక్షరేకుతో మంత్రభస్మంబిచ్చి మహారాజా! నీవీ భస్మంబు దాల్చుము. నీభార్యకీ రక్షరేకిమ్ము. నీకుఁ దప్పక కొడుకు గలుగును. వానికి జంగమదాసని బేరుపెట్టి పదియారవయేట జంగము వేషము వేయించి శ్రీశైలమునకుఁ దీసికొనిపోయి మల్లి కార్జునస్వామివారికిఁ బేరప్పగింపవలయును. అట్లు జేయవేని ముప్పువాటిల్లఁగలదని చెప్పిన విని యానృపాలుండు స్వామి! మీరిట్టి వర మిచ్చియుండగాఁ జెప్పినట్లు చేయుట యబ్బురమా? తప్పక తమ యానతి వడువునఁ గావించెదను.

అని పలికి అయ్యోగి కేదియో కానుక యీయఁ బోయిన అందుకొనక నిర సించెను. మహాత్ములకు ద్రవ్యాభిలాష యుండదుగదా! వజ్రదత్తుఁడయ్యోగికి నమస్క రించుచు నింటికింబోయి తత్ప్రసాదము భార్యకిచ్చెను.

అయ్యోగి జెప్పినప్రకారము వెంటనే యామె గర్భము ధరించి శుభముహూ ర్తంబున నొకపుత్రుంగాంచినది. అబాలుండు రూపంబున మిక్కిలి కొనియాడఁ దగి యున్నందులకు సంతసించుచు జాతకర్మాది విధుల నిర్వర్తించి వానికి జంగమదాసు అని పేరు పెట్టెను.

అజంగమదాసు దినదినాభివృద్ధి వహించి సర్వజన దర్శనీయుడై యొప్పు చుండెను. వాని నుచితకాలమునఁ జదువనేసి పెక్కండ్ర గురువులనియమించెను. వాని విద్యాగ్రహణశక్తి మెచ్చుకొనఁ దగినదియేకాని యెల్లవారిం దిరస్కరించుస్వభా వము వాని బుద్ధికిఁ గళంకము గలుగఁజేయుచున్నది. విద్యల గ్రహించుచు నొజ్జల వెక్కిరించుచుండును. పురాణములం జదువుచుఁ బూర్వుల నాక్షేపించుచుండును. శివకేశవుల యాలయంబులకుఁ బోవుచు శిలలని విగ్రహములఁ దిరస్కరించు చుండును. పెద్దల నవమానించును. ఈరీతి నారాజపుత్రుండు సర్వజనకంటకుండై సంచరించుచున్న రాజపట్టియగుట నెదుట నెవ్వరు నేమియుననలేక చాటున దిట్టు చుందురు.

రాజును వానిదుండగములు దెలిసియు లేకలేక కలిగిన సుతుండగుట నేమియు మందలింపనేరకవాఁడు కోరినట్లు చేసినట్లు యంగీకరింపుచుండెను. వాఁడు దుండగమునఁదిరుగుచు పెక్కువిద్యలయందుఁ బండితుండయ్యెను. పదియారేడుల ప్రాయమువచ్చినది. అప్పుడు రాజు యోగిమాటదలంచి యొకనాఁడు పుత్రుని లాలిం పుచు నిట్లనియె.

రాజు - వత్సా! నీవు ఒకయోగి వరంబున బుట్టితివి. నీకీప్రాయంబున జంగమవేషమువేయించి శ్రీశైలమునకుఁ దీసికొనిపొమ్మని చెప్పెను. పైడిగంటయు కాంచనశంఖమును పట్టుజోలియుం గట్టించితిని నీవు వానిం దాల్పవలయును.