పుట:కాశీమజిలీకథలు -07.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

కాశీమజిలీకథలు - సప్తమభాగము

ముండు నామాట మన్నించునా ? మహర్షులకు దయయుండదా ? మనసుకఱుగునట్లు పాదంబులంబడి ప్రార్థించెదను. కనికరించి వారిని విడిచిన ధన్యులమే యగుదుము. విడువకున్న నాశాపము నేను భరింతునన్న నట్టు చేయకుండునా ? అత్తపసి భార్య యరుంధతీ‌ మహాదేవి కడుయిల్లాలని చెప్పుకొనియెదరు ఆ సాధ్వీమణియైన నన్నను గ్రహింపదా ? ఒక్క యక్కటికము లేక తక్కిన సుగుణములెన్ని యున్నను నిరర్దకములు. వసువులు పరోపకారమునకై చేసినపని తప్పని యెంచి శపించుట వశిష్ఠునిది తప్పు. మునులు ముక్కోపులు. చిన్న తప్పునకే పెద్దగా నలుగుదురు. అతండలిగి శపించుచుండ దాపుననుండి వారింపక యూరక వినుచుండిన యరుంధతీదేవికి రెండవ తప్పు సంతతము భర్త పాదంబులపై దృష్టుల నిడి కూర్చుండినంతనే యుత్తమురాలై పోయినదాయేమి ? భూవదయ సర్వగుణ శ్రేష్ఠమని గ్రంధములుద్ఘోషింపుచున్నవి. ఒకవేళ నీవార్త యరుంధతి వినలేదేమో ? ఇందులకు వేరెద్దియేనిఁ గారణ మున్నదేమో? యని యనేక ప్రకారములఁ దలపోయుచు రోహిణితో నుపన్యసించుచు నడుచుచుండెను

రోహణి :- సఖీ ! జితవతీ ! నీమాటలన్నియు సత్యములే. మహర్షులు శాంతులయ్యు నవమానతు లైనప్పుడు క్రోధరూపముదాల్తురు. వసువులు చోరకృత్యముగావించిరి. ఎట్లైన మ్రుచ్చలించుట తప్పుగాదా అది అట్లుండనిమ్ము. మనము గుమ్మిడికాయలో నావగింజంత పయనము చేయలేదు. అయ్యాశ్రమ మెంతదూరమం దున్నదని యడుగుచుంటివి. హిమవత్పర్వతము దాటి పోవలయనఁట. ఇట్టి కష్టముల నీవెప్పుడైన బడియుంటివా? అప్పుడే నీ మొగము సరసింబాసిన తమ్మివలె వాడఁజొచ్చినది మన యుద్యమము సముద్రమున కేతామెత్తి నట్లున్నది. పరదేశవాశ క్లేశము సామాన్యము కాదు. అని యేమేమో చెప్పుచుండ వినిపించుకొనక? జితవతి మధ్యాహ్నముదనుక నేక దృష్టితో గఱ్ఱమును నడిపించుచుండెను. గ్రామమేదియుఁ గనంబడినదికాదు. పోవం బోవ నయ్యరణ్యాంతరంబున నితాంతశీతల మధురసలిల విలసితంబగు కాసారంబు తీర భూరుహశాఖా సమాచ్చాదితంబై వారికి గన్నుల పండువ గావించినది. తత్తటనికటవట విటపిచ్ఛాయ నా యబలలు గుఱ్ఱము దిగి గమనాయాసము వాయ నాతటాక తోయమున నవగాహన స్నానము గావించిరి.

అప్పుడు జితవతి రోహిణితో, సఖీ ! ఇంతవేళ మిగిలినను నాకు నాకలియు దప్పియుఁ గొంచమైనఁ బొడమినది కాదేమి ? దేవతా శ్రేష్ఠులైన వసువుల వాత్సల్యమున నేమో? అనుటయు రోహిణి నవ్వుచు బూవుఁబోణీ ! సందియమేలా ? కాకున్న నీవింత సేపు నిలువఁగలవా? వినుము నిన్న నీవు త్రాగినవి వాడుకగాఁ బుచ్చుకొను పాలుగావు.