పుట:కాశీమజిలీకథలు -07.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4]

జితవతీప్రవాసము కథ

25

ప్రవాస క్లేశ మనుభవింపఁ జాలవని యాదివ్యదుగ్ధంబుల నీకుఁజెప్పకయే త్రాగనిచ్చితిని నీవు దొందరగా గ్రోలుచు రుచి గ్రహింప నేరవైతివి. మధురాధిక్యంబునఁ దృప్తివడసి కొన్ని దిగవిడిచితివి. జ్ఞాపకములేదా? అదిశర్కరాగుణంబని నీతోఁ బొంకితిని ఈ తప్పు క్షమింపుమని పలికిన విని జితివతి యబ్బురపాటుతో నిట్లనియె.

అహా ! ఆ క్షీరమహాత్మ్య మేమని కొనియాడఁదగినది? పంచ భక్ష్యపరమాన్నములఁ దృష్తిగా భుజించినంత బలము గలిగియున్నది. యోగసక్తా ! నా నిమిత్తమై యెట్టి యమృతము దెచ్చియిచ్చితివి. తల్లీ ! యిప్పు డెట్టి యిడుమలం గుందుచుంటివో? నాకు ఱెక్కలు లేక పోయినవిగదా ఎప్పుడు మీశాపము గ్రమ్మరింతునో. అని యుచ్చరింపుచు రోహిణి! మంచిపనియే చేసితివి. ఇది మనకుఁ బ్రయాణోప కరణమైనది. కాని నీవుఁగూడఁ ద్రాగితివా లేదా? అనుటయు నది అమ్మా ! నీవు దిగవిడచిన పాల నేను ద్రాగితిని. నీకుఁబోలె నాకును దృప్తిగా నున్నదని పలికినది

అప్పుడు జితవతి రోహిణిం గౌఁగలించుకొని సఖీ ! ఇప్పటికి మనము ధన్యులమైతిమి ఇఁక మన యుద్యమము కొనసాగఁ గలదు. క్షుత్పిపాసలు బాధింప నర్జరారణ్యములు దాటిపోవుట కష్టము గాదా. ఆవెత వదల్చితివి. సంతోషమైనది. అని యుబ్బుచుఁ బలికినది. అందుఁ గొంతసేపు జలక్రీడలాడి‌ తత్తీరంబుజేరి మఱియు -

సీ. అంగరాగంబెల్ల గంగపా ల్గావించి
            మేనెల్ల బసుమంబు మేదురించి
    యొడలి భూషలనూడ్చి కడిఁది రుద్రాక్షదా
            మముల సర్వప్రతీకములఁదాల్చి
    విరులు రాలించి కురుల్‌ విరజిమ్మి మఱ్ఱిపా
            ల్దగిలింత జడలు గట్టఁగబిగించి
    చీనాంబరము విసర్జించి మించినవేడ్కఁ
            గాషాయచేలము ల్గలియఁగట్టి

గీ. గురుతరవిరక్తి రూపు గైకొని యెనసఁగ
    విషయ విముఖత మూ ర్తీభవించెననఁగ
    యోగినీవేషములఁ బూని‌ రుచితరీతి
    నాతలోదరులురు వివేకాభిరతిని.

అట్లాకాంతారత్నము లిద్దరు యోగినీవేషము దాల్చి వసిష్ఠాశ్రమ దర్శనవ్యగ్ర గమనలై యుత్తరముగాఁ బోయిపోయి కొన్ని దినంబులకు బ్రాయాగనగరంబు జేరిరి.

అని యెఱింగించి మణిసిద్ధుండు--ఇట్లని చెప్పందొడంగె