పుట:కాశీమజిలీకథలు -07.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జితవతీప్రవాసము కథ

23

ముల నిరూపింపవలయు. ఆ మాట అడుగనిదే యేలచెప్పెదవు. వసిష్ఠముని యాశ్రమ మేదిక్కున నున్నది ? మార్గమెట్లు ? ఇది నీవు తెలిసికొనవలసిన పని. అందుల కిష్టవడియెదవా ? లెస్స. లేకున్న జెప్పుము, నాకుఁ దోచినట్లు కావించు కొనియెదనని పలికిన విని యక్కలికి యులికిపడి సఖీ! నీ వింత నిరూఢముగాఁ జెప్పినఁ గాదందునా ? నీవు కుసుమ కోమలి వగుటఁ బయనమందలి కష్టములు గ్రహించి యామాటాడితి. పోనిమ్ము నీ యిచ్చవచ్చినట్లే కావించెద నిప్పుడేపోయి దెలిసికొని వచ్చెదనని చెప్పి రోహణి యటఁ గడలి నాలుగుదినము లాగ్రామమంతయు విమర్శించే క్రమ్మర జితవతి యొద్దకువచ్చి యిట్లనియె.

రాజపుత్రీ ! అమ్మహర్షి యాశ్రమము హిమగిరి పరిసరమున నున్నదని కొందఱు, వేరుపాదప్రాంతమం దున్నదని కొందఱు, నయోధ్యానగర సమీపమున నున్నదని కొందఱుం జెప్పిరి. యట్లైన నుత్తర దేశమునకుఁ బోవలయును. ఆ దేశమంతయు నరణ్యభూయిష్టమై యన్నదట. యేమిజేయవలయునో చెప్పుము నీయాజ్ఞ వడువునఁ గావించెదనని పలికినది. అప్పుడు జితవతి రోహిణీ ! వసిష్ఠాశ్రమమునకుఁ బోవుటతప్ప నొండుపనికి నామానసం బొల్ల కున్నది. కాషాయాంబరములు రుద్రాక్ష మాలికలు లోనగు యోగినీవేషసంభారము లన్నియుఁ దీసికొనిరమ్ము. ఱేపురాత్రియే పోవలయును. గఱ్ఱమెక్కి కొంతదూరము పోవుదము తరవాత సమయానుకూలముగాఁ జేయుదము. ఇంతకన్నఁ జెప్పునదిలేదు. వేరొక యాలోచనము గావింపవలదు. అని నిరూపించటయు నందులకా పడఁతి యొడఁబడినది. ఆ దివసంబంతయు నా కాంత పయనమునకుఁ గావలసిన వస్తువు లన్నియు సంగ్రహించుకొనినది.

మఱునాడర్ధరాత్రంబున నయ్యంబుజాక్షి లిరువురు నశ్వారూఢులై యెవ్వరికిం తెలియకుండఁ బురంబు వెలువడి యుత్తరాభిముఖులై యరిగిరి. తన నిమిత్తము వసువులు శపింపఁబడిరని వినినది మొదలు అమ్మదవతి నిద్రాహారములు సేయక యేకరీతిఁ జింతింపుచు నెట్లయిన వసిష్టమహర్షి యాశ్రమమునకుంజని యజ్జడదారి యడుగు లంబడి వారి శాప విముక్తులం జేయ నిశ్చయించుకొని యున్నది. తానుఁ కన్యకననియు రాజపుత్రికననియు, నిల్లు గదలరాదనియు నించు. కంతయుఁ దలపదయ్యెను. గృదజ్ఞురాలన నామెనే చెప్పవలయును.

జితవతి యాశ్వారోహణ శిక్షయం దారి తీరినదగుట నా ఘోటకమును బాటవముతో నడిపించుటంజేసి తెల్లవారునప్పటికి వారు బెద్ద దూరము పోయిరి. నడచునప్పుడు జితవతి రోహిణీ ! మనము చాలదూరము వచ్చితిమి. వశిష్టమహర్షి యాశ్రమ మింక నెంతదూరమున్నదియో! యెన్ని దినములకుఁ బోవుదమో ? యాయతిసత్త