పుట:కాశీమజిలీకథలు -07.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

262

కాశీమజిలీకథలు - సప్తమభాగము

శుద్ధురాలని జగద్వితమై యున్నది. అట్టిసాధ్వీరత్నమును మోహించి కలయరమ్మనిన దుర్మార్గు నీచు నల్పుని మాయావి నుత్తముఁడని పొగడ శిక్షింపక యల్లునిగాఁ జేసికొని యామెను నిర్బంధించి చిక్కులబెట్టి విడిచితివి నీకూతురు స్త్రీచాపల్యంబున వాని వరించి నీకు సురసయందు నీరసబుద్దిగలిగించినదని తెలిసినది. అందులకు నీచర్యయే దృష్టాం తముగా నున్నది. అందలి గ్రంథమంతయు సాంతముగాఁ జదివితిని వృధాగా నప రాధిని విడిచి నిరపరాధినిఁ జిక్కులు పెట్టితివి. నీకుగల కీర్తికిఁ గళంకము దెచ్చికొంటివి. స్త్రీబుద్దివిని చెడినవాడవైతివి బ్రాహ్మణులు క్షోభించిన దేశమునకే ముప్పువాటిల్లును. అల్పుడు మాయావియనియు నపరాధియనియు వాఁడు చెప్పినమాటలే చెప్పుచున్నవి. కులశీలాదులు తల్లిదండ్రులం జెప్పకున్న నూరకుందురా. పెక్కులేల అంతయుం దప్పుజేసితివి మాయొద్దనగ్నివర్మ అయ్యభియోగమునుమఱల విచారింపనాజ్ఞ వేడికొని యెను. కావున మేము స్వయముగా తిరిగి విచారింతుము. నీయల్లుని వెంటనేనాయొద్ద కనుపుము. ఇదియే ముమ్మాటికి నాజ్ఞాపత్రిక అని చదివిన విని దేవవర్మ క్రోధాక్రాంత స్వాంతుడైఁ ఔరా! సూర్యవర్మ తాను జక్రవర్తియైన నగుంగాక నిజముదెలియక నన్న న్యాయముజేసితినని వ్రాయుట లెస్సయా? అల్పుని గుణమేమిదెలిసి యిట్లువ్రాసెను. అని పనికి తనలోఁ దాను నిదానించుకొని ఔను. అయ్యభియోగము రీతి జదివిన నట్లే తోచును. గ్రామాధికారిని మండలాధిపతిని నేనిట్ల నలేదా! ఇది వానితప్పుగాదు. నిజము తెలియజేసెదంగాక యని యాలోచించి తిరుగా నిట్టిప్రత్యుత్తరము వ్రాసెను.

మహారాజా! తమ యాజ్ఞాపత్రికం జదివికొంటిని. అయ్యభియోగము నేను బూర్తిగా విమర్శించితిని. అల్పుఁడు కడు నుత్తముఁడు సురస స్మరవశయై తానుజేసిన తప్పంతయు నల్పునిపై మోపించినది. కన్నులారాఁ జూచితిని చెవులార వింటి. నేను న్యాయమే కావించితిని అల్పుని గుణసంపత్తియే నేనల్లుని జేసికొనుటకుఁ కారణమైనది నారాజ్యమున కల్చుఁడే యధిపతి. అతండు మీకు గౌరవనీయుఁడు, అపరాధివలె మీయొద్దకు రానర్హుఁడుగాడు తప్పులు మన్నింపవలయును. అని వ్రాసి సూర్యవర్మ యొద్ద కనిపెను.

మఱిరెండు దినములు గడచిన పిమ్మటఁ గ్రమ్మర సూర్యవర్మయొద్దనుండి మఱియొక కమ్మవచ్చినది. అందు అపరాధియైనప్పుడు నీయల్లుఁడై ననేమి? నీవైననేమి? తప్పక రాజభట బంధితుఁడై మా సభకు రావలసినదే. అందలి నిజానిజంబులు విమ ర్శింతుము. నీకిప్పుడు పనిలేదు. అపరాధియని మాకుఁ దోచిన శిక్షింతుము. కాకున్న గౌరవింతుము. కాని నీకల్లుఁ డైనంత మాత్రముననే నీవు రాజ్యమిచ్చినంత మాత్రము ననే యతండు పూజ్యుఁడు కాఁడు నీవు మాయాజ్ఞ తిరస్కరించినట్లు తలంచితిమి.