పుట:కాశీమజిలీకథలు -07.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

256

కాశీమజిలీకథలు - సప్తమభాగము

గడచిన తరువాత నొకనాఁడు సురస యాగదిగోడలన్నియు విమర్శించుచు నొకదెస నొకగవాక్షము తలుపుండుటఁ జూచి దానితాళముపట్టి లాగినది. అది యూడివచ్చుటచే దాని యరదీయుటకు శక్యమైనది. పిమ్మటఁ దలుపు తెరచినంత అవ్వలి నిట్టిదే మఱి యొకగది గనంబడినది. ఆగదిలోను దనగదిలోనున్న వింతవస్తువులన్నియు నొప్పు చున్నవి.

ఓహో! రాజభటులు దీని బీగమువైచుట మరచిరి. దానంజేసి నాకిది తెరచు టకు శక్యమైనది. ఇందేమి విశేషము లున్నవియో చూచెదంగాక యని దాని తలుపు పూర్తిగాఁ దెరచి తలయెత్తి లోపలికిఁ దొంగిచూచినది. ఆగదిలో అల్పుఁడు ఒక పీఠముపైఁ గూర్చుండి కన్నులు మూసికొని ధ్యానించుచుండెను.

వానింజూచినంత సురసకు మేనుఝల్లుమన్నది. రోమాంఛముదయమైనది. చెమ్మటలుక్రమ్మి కంపమావిర్భవించినది. ఒక్కింత తడవు ధ్యానించి కన్నులు మూసికొని తలయూచుచు నలుమూలలు పరికించి యితరుల కందుండుట సాధ్యము కాదని నిశ్చయించి యావరణ దాపున నిలువంబడి వానికి వినిపించునంతట మందస్వ రముతో అల్లన నిట్లనియె.

ఓసుందరపురుషా! నాఁడు నామాట వినకపోవుటచేత గదా! నీకీ అవస్థ వచ్చి నది. నీవంగీకరించిన నిన్ను నా ప్రాణమునం బెట్టుకొని కాపాడక పోవుదునా? నాకుఁ బదివేల దీనారములు వెలగలనగలున్నవి. అవి యన్నియు నీకు తక్కిపోవును. నామన సింతదనుక నెవ్వరియందును వ్యభిచరింపలేదు. నీయందు సక్తమైనది. కారణమేమియో చెప్పఁజాలను. నిన్ను శిక్షింపవచ్చునాయని రాజు నన్నడిగినప్పుడు మీచిత్తమంటినికాని శిక్షింపమనుటకు నోరువచ్చినదికాదు అనన్యపూర్వనై నిన్ను వరించి గౌఁగిలి యాసించిన ద్రోసివై చితివి. నీకంటెఁ గఠినాత్ముడుండునా? నీవు బురాణము వినుచుండ నిన్నుఁజూచి విరాళి గుందికుంది యాగలేక నీళ్ళుదెచ్చు నెపం బున నీవెనువెంట వచ్చితినికా:దా నామాటకెదురుజెప్పినందులకుఁ గోపమువచ్చి యింత జేసితిని. నీవు నిజము చెప్పక నేరముజేసి నట్లొప్పుకొనుట నాయందుఁగల మక్కువ చేతనేయని గ్రహించితిని. కోపమంతయుఁ బోయినది. నీమదియుఁ దిఱిగియుండును ఏమిజేయుదును? అంటించిన తరువాత నార్పుట గష్టముగదా? కానిమ్ము గతము విచారింపరాదు. ఇప్పుడైనను నీవంగీకరించినచో నీయభియోగము దప్పిందెద. మనము దేశాంతరముపోయి సుఖింతము ఇటు చూడుము నేను నీయందమునకు సరిపడి యుండలేదా యేమి? ఈగవాక్షము దాపునకువచ్చి యొక్క సారి ముద్దువెట్టి వెళ్ళుము అని యేమేమో విరహాతురతయై సంభాషించిన విని