పుట:కాశీమజిలీకథలు -07.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

254

కాశీమజిలీకథలు - సప్తమభాగము

వినత - నేను జెప్పనక్కరలేదు. అంతయు సంక్షేపముగా నిందే వ్రాయఁబడి నది చూచికొనుము. అని పత్రిక చేతికిచ్చుచున్నది.

యమున - (చదివి) విమర్శించి ఇందలి నిజము నేను జెప్పఁ గలనుసుమా.

వినత - అట్లైన నాకానుక నీకే రాగలదు.

యమున -- అల్పుడేపాటి చక్కనివాఁడో సురస యెంతయందగత్తెయో చూచి వచ్చి నాకుఁ జెప్పగలవా?

వినత --- సరి, సరి ఇదివరకే చూచితిని అల్పునిరూపముసామాన్యమని చెప్ప? జాలను. రాచబిడ్డలకైన నాసౌకుమార్యము ఆతేజము ఆచక్కఁదనము గలిగియుండదు. మన్మధునికైన లోపమున్నది కాని వానికిలేదు. వాని ముఖవిలాసము జూఁడ జక్రవర్తి బిడ్డఁడని తోచక మానదు. భర్తృదారికా! కులశీలాదులు తెలియమి ననఁగూడదు కాని వానింజూచిన నీవుగూడ మోహమందెదవు సుమీ?

యమున --- సురసయో?

వినత -- చక్కనిదే కాని వాని అందమునకు సరిపడదు.

యమున - అట్లైన సురసయే మోసకత్తెవలెఁ దోచుచున్నది నిజము తెలిసి కొని పారితోషిక మందనా!

వివత - అబ్బో ! ఈలాటిమాట అందరుఁ జెప్ప గలరు. రాజుగారికిఁ బ్రత్యక్షము జూపవలయునఁట.

యమున - చూపకున్న నాబుద్దిబలమును గొనియాడకుము.

వినత - అటైన నయ్యగారితోఁజెప్పి తీసికొనిరానా?

యమున - పోయి చెప్పుము.

అనుటయు నది అతిరయంబునం బోయి పుడమిఱేని కత్తెఱఁగెఱింగించినది. నరపతి అపరిమితానందముతో గొమార్తె అంతఃపురమునకువచ్చి పట్టీ ! వినతతో నీవేమో చెప్పితివఁట సత్యమే? అందెవ్వరిది అసత్యమో యదార్దము చూపగలవా అని యడిగిన యమున నవ్వుచు దండ్రీ! ఆఁడుదానిదేతప్పు మగవాని యందేదోషము లేదు. వాంగ్మూలము లన్నియుఁ జదివితినని పలికెను.

అప్పుడు ఱేఁడు అట్లనుట కవకాశము లేదు. సురస స్వభావమును గురించి అయ్యగ్రహారమందే కాక ప్రాంత గ్రామములందను బరిశీలింపఁ జేసితిని ఇంచుకయైన దోషారోపణ మెవ్వరును జేసియుండలేదు. పత్రికలం జదివి దోషురాలనిన నాకుఁ దృప్తిగా నుండునా? ప్రత్యక్షము జూపవలయు అదియుంగాక అల్పుఁడు కులశీలా దులు తలిదండ్రులనుఁజెప్పఁడు తప్పుజేసినట్లొప్పుకొనుచున్నాఁడు. వాఁడేయపరాధియని