పుట:కాశీమజిలీకథలు -07.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

252

కాశీమజిలీకథలు - సప్తమభాగము

రాజు -- జరిగిన యదార్థము చెప్పక తీరదు.

అగ్ని - అమ్మా భయమేల నిజము చెప్పము.

సురస - (తలవంచుకొని నేల బొటనవ్రేల వ్రాయుచుఁ నేను నూతికిబోవు చుండగా వెనుకనేవచ్చి నోటితో నీలవైచిన నేదియో కూయుచున్నదని వెనుకతిరిగి చూచితిని వీఁడు నావెనుక వచ్చుచుండఁ జూచితిని.

రాజు --- తరువాత.

సురస - మరల అటుతిరిగి అఱుగుచుండ బాలా! నిలు నిలు మను ధ్వని వినఁబడినది అప్పుడు భయపడి వడిగా నూతి యొద్దకు బోయి నీరుతోడుచుండ వీఁడు నా దాపునకు వచ్చి ముద్దియా ముద్దియ్యవా! అని యడిగిన అర్థము జేసికొన లేక ముద్ద యనగా నేమియని అడిగితిని.

రాజు - అంతకు ముందుఁ బురాణము వినుచుండ మీయింట నెప్పుడైన వీనిం జూచితివా?

సురస - చూచిన జ్ఞాపకములేదు.

రాజు --- వీఁడు నిన్నెరుఁగునా!

సురస - ఎరుగబట్టియే వెంటవచ్చెను.

రాజు -- నీవీ యగ్నివర్మ కూతుఁరవని యెరుంగునా!

సురస - ఎరుఁగునో యెరుఁగడో నాకు దెలియదు.

రాజు --- నీమాట విని వీఁడేమి జేసెను.

సురస - ముద్దగాదు ముద్దు అదియిమ్మని అడిగితిని. ఇత్తువా? యని యుత్తరము జెప్పెను.

రాజు --- తరువాత నీవేమంటివి?

సురస - నీచా! నిన్నేమి జేయింతునో చూడుము. నాశీలము దెలియక యిట్లు పలికెదవా? అని పలికి అందు నిలువక పారిపోయి వచ్చి మాతండ్రితోఁ జెప్పితిని.

అగ్ని -- అమ్మా! గౌఁగిలిమాట జెప్పుము.

రాజు - ఆ. ఆ మీరేమియు మాటాడఁగూడదు.

అగ్ని -- నాతోఁ జెప్పినది లెండి అందుమూలమున జ్ఞాపకము చేయు చున్నాను గ్రామాధికారి దగ్గిర కూడ జెప్పినది వ్రాసినాఁడు చూడుఁడు.

రాజు --- మీరు ఛాందసులు, ఏమాటనవలయునో తెలియదు ఊరుకొనుఁడు పుత్రీ! పిమ్మట నేమిజేసితివి.

సురస -- జ్ఞాపకమువచ్చినది. నేనింటికిఁ బోవుచుండగా నడ్డము వచ్చి గౌఁగ లింపఁబోయెను. తప్పించుకొని పారిపోయితిని.