పుట:కాశీమజిలీకథలు -07.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అల్పుని కథ

251

అగ్ని -- సాక్షాద్రష్టాసాక్షి. కన్నులారా చూచినవాఁడు సాక్షియనియర్ధము, వ

రాజు --- సరిగానే చెప్పితిరి. మీకూఁతు నల్పుఁడు గోరుచుండఁగా జూచినవా రెవ్వరు?

అగ్ని --- సరి. సరి అది అబద్దమాడునా! సత్యసంధురాలు స్వామీ! దానిమాట శిలాశాసనమువంటిది తప్పక నమ్మదగినదే అదియునుంగాక నే నెన్నఁడైనను బొంకి యెరుఁగుదునా నామాటయెందైన దమకు విశ్వాస ముండనక్కరలేదా?

రాజు - మీరు చూసితిరా!

అగ్ని - ఆ. చూచినట్లె.

రాజు - 'నట్లు' పనికిరావు. చూడవలయు.

అగ్ని - అగ్నిహోత్రసాక్షిగా నిజమని చెప్పఁగలను

రాజు - ఇప్పుడు వీని నేమిచేయమందురు?

అగ్ని --- శిక్షాస్మృతిలోఁ జెప్పినట్లు చేతులు తరుగవలయు బ్రాహ్మణపుత్రికను అధమకులుఁడు కామించిన నేమివ్రాయఁబడినదో చూఁడుడు. వీడు మహాపాపాత్ముఁడు పది దినములు మాయింటఁగుడిచి పురాణము వినువాఁడుంబోలె నభినయించిన నిజమను కొంటిని రాజా!

రాజు - అల్పుఁడా! నీవేమనియెదవు?

అల్పుఁడు -- న్యాయశాస్త్రప్రకారము తప్పుజేసిన వానినిశిక్షింపఁమనుచున్నాను.

రాజు --- నీవు తప్పుజేసితివా?

అల్పుఁడు - సందేహమేలా?

రాజు - నిన్నుఁ దండింపవలసినదేనా?

అల్పుడు --- సందేహమేమిటికి?

రాజు -- ఏమిటి కట్టితప్పు జేసితివి.

అల్పుఁడు - ప్రారబ్ధ శేషంబునంబట్టి.

రాజు - దేవీ! నిన్నీ యల్పుఁడు గామించినమాట వాస్తవమే?

సురస - (తలవంచుకాని) వాస్తవమే?

రాజు -- -వీనిని శిక్షింపవచ్చునా?

సురస - దేవర చిత్తము.

రాజు --- సురసా! నిన్నితఁడెట్లు కామించెనో చెప్పుము.

అగ్ని - తరచితరచి మీరట్లడిగిన సిగ్గువిడిచి యేమిచెప్పెడిని ఆడువాండ్రు సభలలో మాటాడగలరా? నావంటి వానికే వణఁకు వచ్చుచున్నదిగదా!