పుట:కాశీమజిలీకథలు -07.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

250

కాశీమజిలీకథలు - సప్తమభాగము

నాఁడు దేవవర్మ కొల్వుకూటమునకు వచ్చినతోడనే ప్రధాని మొగముజూచి యాబ్రాహ్మణులు వచ్చిరా? వారియభియోగము విచారింపవలయు. సర్వము సిద్ధముగా నున్నదియా? యని యడిగిన నతండు దేవా! అందరువచ్చియున్నారు. విచారింపవచ్చు ననియుత్తరముచెప్పెను.

అప్పుడా మహారాజు తొలుతనేయల్పునిఁ బిలిపించెను. అల్పుడు రాజునెదుటకు వచ్చి నమస్కరించెను.

రాజు - నీ వెవ్వడఁవు?


అల్పుడు.శ్లో. నాహందేహో నేంద్రియాణ్యంతరంగః
                నాహంకార ప్రాణవర్గో న బుద్ధిః
                దారపుత్రక్షేత్ర విత్తాదిదూరః
                సాక్షినిత్యః ప్రత్యగాత్మా శివోహం.

రాజు - స్వగతము. ఆహా! వీని సౌందర్య మా సేచనకమై యున్నది. మాటలు మిక్కిలి ప్రగల్భముగా నున్నవి. మనోహరమైన వీనిమొగము జూడ నాకును బుద్ది మారిపోవుచున్న దేమి? కానిమ్ము ప్ర॥ మాయెదుట వేదాంతములు పనికిరావు యదా ర్దము చెప్పవలయును.

అల్పుఁడు - నేజెప్పినదే యదార్థము

రాజు - సరే అటుండు (అని చెప్పి సురసను అగ్నివర్మను పిలిపించి) సురసంజూచి స్వ॥ అబ్బా! ఇబ్బిబ్బోకవతియు వింతరూపున నొప్పుచున్నదిగదా! వీరిరువురుఁ జూఁడదగినవారే ఒండొరులువరింప దగియుండిరి ప్ర॥ ఈచిన్నదాని తండ్రియెవ్వరు?

అగ్ని - మహాప్రభూ ! నేను. నాపేరు అగ్నివర్మయందురు. అగ్నిహోత్రములు సేయుచు సత్కాలక్షేపము సేయుచుండు నాకీ ముప్పు వాటిల్లినది దేవా! యెన్నఁడు రచ్చకెక్కి యెరుఁగను. నాకు లేక లేక యీబిడ్డపుట్టినది మీరు తండ్రులుగనుక చెప్పు చున్నాను. దీనికి మగవాళ్ళనిన నసహ్యము సిగ్గువిడిచి చెప్పుచున్నాను. పురుష వాంఛ యేలేదు. ఆజన్మశుద్ధురాలు. మాగ్రామాధికారికి మాయందు విరోధము. ఆతుచ్చుడు మంచివాఁడనియు నాబిడ్డ చెడ్డదనియు వ్రాసి పంపినాఁడట. మండలాధిపతి యతఁడే మనిన నట్లే వ్రాయుట వాడుకయఁట స్వామీ ! మమ్ము వృధాచిక్కులు పెట్టి త్రిప్పి త్రిప్పి చంపుచున్నారు? ధర్మస్వరూపులైన యేలినవారు మాకు న్యాయము దయచేయఁ బ్రార్దించుచున్నాను.

రాజు - భూసురో త్తమా! మీరు పండితులుగదా! సాక్షియనఁగానేమి?