పుట:కాశీమజిలీకథలు -07.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32]

అల్పుని కథ

249

జెప్పఁజాలను. యౌవన మన్నివికారములం గలిగించును. వావులు దెలియనీయదు. ఇంద్రియగుణ౦బులు విద్వాంసునైన మోసముజేయును. నేనీయపరాధము జేయటకుఁ జేయకపోవుటకు నావశమా? దై వమేయట్టి బుద్ది పుట్టించును. నన్నుఁ దప్పక శిక్షింప వలసినదే సురసయందించుక దోషములేదని నేనొప్పుకొనుచున్నా ను. అని చదువునంత నమ్మహికాంతుఁడు నిలు నిలు పిమ్మటఁ జదువనవసరములేదు. అన్నిటికి వాఁడొప్పు కొనుచుండ గ్రామాధికారికీ సందియమేలఁ గలుగవలయును. అని యాక్షేపించిన నృప తికి మంత్రి యిట్ల నియె.

దేవా! గ్రామాధికారియొక్కఁడే పొరపడలేదు మండలాధిపతియు వానిబుద్ధితో నేకీభవించెనే? అని చెప్పిన నయ్యెకిమీఁడు ఔను ఆమాట మరచితిని. వాని వ్రాఁతఁ కూడఁ జదువుము. ఆజాల్ముల కధికారమిచ్చినవాఁ డెవ్వఁడు? అని వారి౦ దిట్టుటయు నణచివైచి మంత్రి మఱల నిట్లు చదువుచున్నాడు.

అగ్నివర్మ శ్రోత్రియుఁడగుగాక సురస మహాపతివ్రత యగుఁగాక అల్పునిదెస సాక్ష్యము లేకపోవుఁగాక నాకును గ్రామాధికారికిం బోలెఁ చిత్తము డోలాయితమగు చున్నది జవరాండ్ర చిత్తములు క్షణక్షణమునకు మారుచుండునని శాస్త్రములు చెప్పు చున్నవి. మగనియందు ద్వేషముగలవారే పరపురుషులయం దనురాగము గలిగి యుందురు. వ్రాయవలసి వ్రాసితినిగాని ఆమాటయు నేను ధ్రువపరచను. దేవర చిత్తానుసారముగావింపఁ బ్రార్దించుచున్నవాఁడ. అని మంత్రి మండలాధిపతి వ్రాసిన తీరుపుచదివి వినిపించెను.

రాజుముక్కుపై వ్రేలిడుకొని ఔరా? నిస్సంశయమైన విషయమందు వీరికీ సందియమేల గలుగవలయును? స్త్రీలకంటె మగవాండ్రే చంచలులు కులగోత్రాదులు దాచి మారుపేరు పెట్టికొని దుర్జనులు గూఢముగా సంచరించుచుందురు. నాకుఁ జూడ వాడట్టివాఁడుగాఁ దోచుచున్నవాఁడు. కానిమ్ము ఇద్దఱిబుద్దియు నొక్కత్రోవం బోయి నదిగదా! అందేదియో విశేషముండకమానదు. పత్రికలంజూచి తీరుపుఁ జెప్పగూడదు. మొదటినుండియు నీయభియోగము విచారించవలసియున్నది. అందఱిని రప్పింపుము. జాగు సేయఁగూడదు. మనదేశమున బ్రాహ్మణులు విచారింపఁగూడదు. ఇందులకు మూఁడుదినములు గడువిచ్చితినని చెప్పి యారాజుకొలువు చాలించి యంతఃపురమున కరిగెను.

మంత్రియామూఁడవనాఁటి యుదయమునకే వారి నందఱిధర్మస్థానమునకు వచ్చు నట్లాజ్ఞానపత్రికలఁ బంపుటయు నందరు నట్లెవచ్చి హజారమున వేచియు౦డిరి. ఆవిచిత్రాభియోగ వృత్తాంతము విని ప్రజలు పెక్కండ్రువచ్చి సభ నలంకరించిరి.