పుట:కాశీమజిలీకథలు -07.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అల్పుని కథ

247

బెల్లము గొట్టినరాయివలె మాట్లాడక యేడ్చుచుంటివా? అని అగ్నివర్మ దుడ్డు కఱ్ఱతో వానినెత్తిమీదగొట్టిన గాయమై రక్తముగారఁజొచ్చినది. విద్యార్దులు భయపడుచు నారక్తమద్దియద్ది పట్టులువైచి యెట్లో యాగంటుస మాటుపెట్టిరి. అల్పుఁడు గంటు బాధ యెక్కుడుగానున్నను లెక్కసేయక వారిమాటలకేమియు సమాధానము జెప్పక మౌనముద్ర వహించి యుండుటంజూచి అగ్నివర్మ యానతిపై విద్యార్థులతని ఱెక్క లుగట్టి గ్రామాధికారియొద్దకుఁ దీసికొనిపోయి వాఁడు చేసిన యపరాధమంతయుం జెప్పి వానికి దగిన శిక్షవిధింపుమని కోరిరి.

ఆగ్రామణియుఁ దనబుద్దిబలమంతయు వినియోగించి యాయభియోగము విచా రించి డోలాయితహృదయుండై యేమిచేయుటకుం దోచక యేదియో తీరుపువ్రాసి తనపై అధికారియగు మండలాధిపతి యొద్దకనిపెను. ఆమండలాధిపతియు నాయభి యోగమంతయు నిమర్శించి కర్తవ్యాంశము గ్రహింపనేరక అప్పుడు రాజుగానున్న దేవవర్మ అను నృపతియొద్ద కనిపెను.

ఆదేవవర్మ యొకసామంతరాజు మణిచక్రమను నగరంబున కధినాయకుండై న్యాయంబునఁ ప్రజల బాలింపుచుండెను.

ఆతనిదేశము చిన్నదైనను దాను సామంతరాజై నను ప్రజాపాలన కౌశల్యం బునంజేసి అతనికీర్తి దిగంతవ్యాప్తమైనది. ఆతండు దండ్యులవిడువకుండ నదం డ్యుల శిక్షింపకుండ నపరాధముల విమర్శింపుచుండెను. స్వల్పాపరాధములనై నను బెద్దగా విచారించి నిజముదెలిసికొని శిక్షలు విధింపుచుండును.

ప్రభువు ననుసరించియే క్రిందియధికారులు జాగరూకతతో నభియోగముల విచారించి యపరాథులనేకాక యసత్యసాక్షులఁ గూడ శిక్షింపుచుందురు. దానంజేసి అసత్యాభియోగములు సాధారణముగా న్యాయస్థానములకుఁ దేనేతేరు తెచ్చినచో దాని మూలకందకముత్రవ్వక యధికారులు విడువరు.

ఒకనాఁడు దేవవర్మ పేరోలగంబునుండి అభియోగము విచారింపుచుండెను. మంత్రి అగ్నివర్మదెచ్చిన అభియోగపత్రికలఁ జేతంబూని చిరునగవుతో రాజుంజూచి దేవా! ఇదియొక వింతయగుతగవు గ్రామాధికారియు మండలాధిపతియు, నిందలి నిజంబు దెలిసికొనలేక వారు తీరుపుజెప్పక మనయొద్ద కనిపిరి. దేవర చక్కగా విచా రించి నిజము దెలిసికొనవలయునని పలికిన విని రాజు వి‌స్మయ మభినయించుచు న్యాయ వేత్తలిరువురకును దెలిసినదికాదా. దాని ప్రచారమెట్టిదో చదువుమని అడిగిన నతండిట్లు చదువుచున్నాడు

దేవయజనాగ్రహారము కాపురము ప్రవరునిభార్య సురస (వాది) అగ్నివర్మ (అనువాది) అల్పుఁడనువాడు (అపరాధి)