పుట:కాశీమజిలీకథలు -07.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

246

కాశీమజిలీకథలు - సప్తమభాగము

వాఁడు కదలక ఇటునటు చూచుచు నెండలో నితరులం దెవ్వరు లేకపోవుట నవసమెఱింగి తరుణీ ! నీమగడిందున్న వాఁడుగదా. నీకతనియం దిష్టములేదని విన్నాను. శుష్కోపవాసములచే నీ యౌవనమిట్లు పాడుచేసికొనుచుంటివేల? నిన్నుఁ జూడఁజూడ నాయెడద జాలిగలుగుచున్నది. గతించినయౌవనము తిరిగి రానేరదు. ఈపరువ మంతయు రిత్తవో నిటెవిరక్తిఁ దిరుగుట లెస్సగాదు. అని యేమేమో యసందర్భ ప్రలాపములాడి తుదకుఁ దన్నుఁ గూడుమని పలుకుచు దాపునకువచ్చి చేదఁబట్టికొని గౌఁగలింపబోయెను.

తండ్రీ! పైవార్త నీతో నేమనిచెప్పుదును కొప్పుపట్టుకొని నడుముదిగిచి చేతుల లాగుచుఁబెక్కుచిక్కులంబెట్టెను. కేకలువైచితిని. దాపుననెవ్వరునులేరు. పెద్దతడవు నకుఁ జేతిపట్టుతప్పించుకొని యెట్లో పారిపోయివచ్చితిని. నాయొడలంతయు నెట్లు చీరెనో చూడుము నాప్రారబ్ధము, పరపురుషునిచే నిట్టియలయిక బొందింపఁబడితిని. ఇఁక నాదేహము కాల్పనా అని పలుకుచు నేడువఁదొడంగినది.

ఆమాటలువిని అగ్నివర్మ ఆ? ఏమీ? అల్పుఁడే నిన్నట్లుచేసినది? ఔరా? ఎంత టక్కరివాఁడు. భారతమువినుచు వేదాంతగోష్టి వచ్చినప్పుడు కన్నులు నానందభాష్ప ములఁ గార్చుచుండునే. సెబాసు అల్పుఁడా! గురుపుత్రినినే పట్టనెంచితివిరా? కృతఘ్నా! అని తిట్టుచు దల్లీ! ఈఎండలో నొంటిగా దూరమందున్న నీటికేమిటికిఁబోయితివి? నీవఱిగినవి మీయమ్మయెఱుఁగదఁటే. కానిమ్ము ఆతుచ్చుఁ డెందున్న వాఁడో చెప్పుము. వానినిప్పుడే కట్టి అధికారి కప్పగించెదనని అడిగిన నాపడఁతి యిట్లనియె.

తండ్రి! వాఁడు నన్నుఁ బరిభవించి నాచేఁ దిరస్కరింపఁబడి యా తోటదెసకుఁ బారిపోయెను ఆప్రాంతమందే యుండునని యెఱింగించిన విని ఆతండట్టెలేచి దుడ్డు కఱ్ఱ చేతంబూని విద్యార్థుల వెంటఁబెట్టుకొని యాతోటల వైపునకఱిగి నాలుగుదెసలు పరికించెను.

ఒక పొలములో నొకచెట్టుక్రిందఁ గూర్చుండి యేదియో ధ్యానించుచున్న అల్పునింజూచి యగ్నివర్మ కోపావేశముతో కృతఘ్నా! ఇన్నిదినములు మాయింటఁ గుడిచి నాపుత్రికబట్ట నుద్యోగించితివిరా. ఛీ! ఛీ! నీమొగము జూచిన మహాపాతకము రాఁగలదు. మన్మధునివంటి పెనిమిటిమొగమే చూచినదికాదు. ఆజన్మబ్రహ్మచారిణి నాకూఁతు నియమము నీవేమెఱుంగుదువు నిన్నువలచు ననుకొంటివిరా మూఢా! నీనక్క వినయముజూచి నిన్ను విరక్తుఁడవనుకొంటి ద్రోహుఁడా! అని యెన్నియో నిందావాక్యములాడిన విని యల్పుఁడేమియు మాటాడక తలవంచుకొని కన్నీరు విడువఁ జొచ్చెను.