పుట:కాశీమజిలీకథలు -07.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అల్పుని కథ

245

ఆరెండును మోక్షమునకు ముఖ్యమార్గములు రెండును గష్టపడి యాచరింప దగినవి. రెండును మహాఫలముల నిచ్చునవి. సత్పురుషులు రెంటిని నాచరించి ముక్తినిఁ బడసి యున్నారు ఒకదాని కొకటి తీసిపోవదు. అని వానిగుఱించిన యుపాఖ్యానముల నెరిం గించి భీష్ముఁడు థర్మరాజు మనస్సంశయమును బోగొట్టెను.

ఆకథ అంతయు విని యాచిన్నవాడు లేచి అగ్నివర్మకు నమస్కరించుచు మహానుభావా! నేఁడు నామనంబునంగల సందియమంతయుం దీర్చితివి. నేను గృహస్త థర్మముకన్న యోగథర్మ మధికమని తలంచువాఁడ. అమృతప్రాయమైన పురాణ వాక్యము వినిపించి నా సందియముదీర్చితివి. సంతోషమైనదని స్థుతియించుచున్న వానింజూచి అగ్నివర్మ బాలుఁడా? నీదేయూరు! నీపేరేమి? కులమెయ్యది? ఎందుబోవు చున్నాడవని అడిగిన వాఁడిట్ల నియె.

అయ్యా! నాపేరల్పుఁడందురు. నాతలిదండ్రులెవ్వరో యెఱుంగను. కులగోత్ర ములు మునుపే తెలియవు. ఏకాకినై తీర్థయాత్రలు సేవింపుచున్నఁవాడ. నేఁడు మంచి వాక్యము లుపదేశించి శ్రోత్రానందము గావించితిరి. కృతార్ధుండనై తినని పొగడుటయు నాభూసురుండు వానిసుగుణసంపత్తికి సంతసించుచు బాలుఁడా. నీమాటలు విన విర క్తుండవువలెఁ గనంబడుచుంటివి. నీకుత్సాహమేని కొన్నిదినంబులిందుండి పురాణము వినుచుండుము మఱియు నీమనస్సందియములన్నియుఁ దీరఁగలవు. మాయింటఁ గుడు చుచు నీయిచ్చవచ్చినన్ని దినములుండుమని పలికిన విని సంతసించుచు నాఅల్పుఁడు వారింటనుండి పురాణమువినుచు శ్రీశుకుఁడోయనఁ జూచువారలకుఁ దోచుచు గొన్నిదిన ములు గడిపెను.

ఒకనాఁ డగ్నివర్మ కూఁతురు సురస కుతనకాలంబున నెండలో నూరున కించుకయెడముగానున్న నూతికి నీరుదేరనరిగి కొంతసేపటికిఁ దలవిరియఁబోసికొని యొడలు జీరికలతో భీభత్సవేషముగ్రాల గోలున నేడ్చుచు నింటికివచ్చి తండ్రి పాదం బులంబడి గద్గద స్వరముతో నిట్లనియె.

తండ్రీ! నీవుపండితుఁడవే కాని లోక జ్ఞానము లేనివాఁడవు. అల్పుని కులశీల నామంబులు దెలిసికొనక యింటం బెట్టికొందువా ! అల్పుఁడల్పుఁ డేయయ్యెను. వాఁడు వట్టిటక్కరి ఆనీచుఁడు నన్నుఁ గామించి తిరుగుచున్న వార్త నాకుఁ దెలియదు. నేను బిందె తీసికొని మంచినీటిబావికిఁ బోయితిని నావెనువెంటవచ్చి నేను నీరుతోడుచుండ జవ్వనీ నీవుమృదువైనదానవు. నీరుతోడిన నీచేతులు కందఁగలవు నేను దోడెదఁ జేద నిమ్మని అడిగెను. నేనామాటవిని విశ్వాసమున కట్లనుచున్నాడని తమ్ముఁడా వలదు. నాకు దీనశ్రమలేదు ఎండలోవచ్చితివేల? ఇంటికిబొమ్మని చెప్పితిని;.