పుట:కాశీమజిలీకథలు -07.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జంగమదేవరకథ

239

అంతలో నాపర్వత ప్రాంతమునుండి గండశిలవంటితలయు గహ్వరమువంటి వదనబిలము గుహాబిలమునుండి ప్రవహించుచు రక్తప్రవాహమోయను భ్రాంతి గలుగఁజేయు నాలుకయు వాడికోరలు జుంజురు వెండ్రుకలు పొట్టిచేతులుంగలిగి తాళడ్వయో భ్రాయకాయముతో బొబ్బలిడుచు వచ్చుచున్న యాభూతరాజు విరతి కన్నులం బడియెను. చీకఁటికిని వాని మేనికాంతికి నించుకయు భేదములేదు. కోరల తెలుపును, నాలుక యెఱుపునుంబట్టి శిరంబు గ్రహింపఁబడినది వాని వికృతాకారము జూచి యీచిన్నది కన్నులుమూసికొన్నది, అంతలో మఱలఁజూచినంత నావికృత రూపము కొంతతగ్గినది. చేరువకు వచ్చినకొలఁది వానియాకారము హ్రస్వమగు చుండెను. తుదకా శిలాఫలకము చెంతకు వచ్చునప్పటికా భూతమొక సామాన్యమాన వుఁడువలెఁ గనంబడెను.

అభూతరాజు శిలాఫలకమునఁ గూర్చుండి ప్రేయసీ! ప్రేయసీ! యెందు న్నావు ఇంకను వచ్చితివికావేమి యని పిలిచెను. నూతిలోనుండి వానిభార్య గొట్టము పైనున్న మెట్లెక్కివచ్చి ప్రాణనాధా! నేడు జాగు చేసితిరేల? మీరు రాలేదుగదా? ఊర కుండనేల? జలజంతువులేమైనం దొరుకునేమోయని నూతిలోనికిం బోయితిని. ఏమి యుం దొరికినవికావు మీరాహార మేమి తెచ్చిరి? నరమాంసము లభ్యమైనదియా? యని యడిగినది.

అతండు పక్కున నవ్వుచు జవ్వనీ! నేడు ఒట్టుపెట్టినట్టేమియుం దొరికినది కాదు. నరమాంసమటుండనిమ్ము. కుక్క మాంసమైనదొరకలేదే! ఇదియేమిచిత్రము; నీవేమైన సంగ్రహించిన మాంసమున్న దేమో తీసికొనిరమ్ము కడుపు మండిపోవు చున్నది. ఇట్టియాకలి యెప్పుడు వేయలేదు. రామరామ యేతాటిచెట్టు చెంతకుఁబోయి నను వట్టికండలే దా? నాలుక తడుపుకొనుటకై నఁ గల్లుచుక్క దొరి‌కినదికాదు అని చెప్పిన వాని భార్య నిట్టూర్పు నిగుడించుచు నిట్ల నియె.

అయ్యో? మీరు ఆహారము తీసికొనివత్తురనిగంపెడాసబెట్టుకొని యుంటిని. అదియేమిపాపమో నాకును నేడే యాకలి పెద్దగానున్నది. ఏదియును దొరకక పోవు టచేతఁగాఁబోలు ఏమి చేయుదము? నూతిలో నీళ్ళుగలవుగదా కడుపునిండ గ్రోలుదము అనియుత్తరమిచ్చినది.

అక్కటా! పరగడుపున వట్టి నీరు నోటికిఁ బోవదుగదా! మఱి యేమాంసమైన వెదకి తీసికొనివత్తు. నీపుణ్యము అని దీనస్వరముతోఁ బ్రతిమాలికొనిన విని యాభూత కాంత మనోహరా? మనభయంబున పశుపక్షిమృగాదులీయడవిలో వసింపవుగదా! ఇం దెక్కడ మాంసము దొరుకును? మీకంతగా నాకలియగుచున్నచో నన్నుజంపి నామాంసము భక్షింపుడు అని పలికినది.