పుట:కాశీమజిలీకథలు -07.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

238

కాశీమజిలీకథలు - సప్తమభాగము

నిండును. అప్పుడప్పుడీ భూతదంపతులు పాతాళమున కీదారిం బోవుచుందురు. ఈ ప్రాంతమందు రాత్రుల మనుష్యులు నిలువఁగూడదు. నిలుతురేని వారలకు గబళము లయ్యెదరు.

అని పిశాచభాషలో వ్రాయఁబడియున్నది. ఆలిపిఁజదివి యమ్మదవతి ముదము జెంది యాప్రాంతమందున్న యొక చెట్టుక్రిందఁ బండుకొని తత్సమయ మరయు చుండెను. సుగతుండును వెలగపండ్లు కొన్ని కోసికొనివచ్చి తాను దిని కొంతయాకలి యడగించుకొనియెను.

విరతి యొక్కటియుఁ దినినదికాదు. సుగతుఁ డామె వసించిన చెట్టుక్రిందనే దానును వసియించెను. సుగతునకు శిలాశాసనవిషయము లేమియుం దెలియవు. కౄరమృగములేవై న వచ్చునప్పుడు గంట వాయించి శంఖమూదువాఁడు. అందుకు జడిసి యవిపారిపోవుచుండునవి

అవి చీఁకటిరాత్రులగుటఁ గాటుకపూసినట్లు దెసలెల్ల నంధకారమయమై యున్నవి. సుగతుండు వెంటనే నిద్రబోయెను విరతి నక్షత్రగమనము పరీక్షించుచు నిద్రబోక భూతాగమనకాల మరయుచుండ రెండుజాములై నది. అప్పుడు పొలుసు కంపుగొట్టినది ఆవాసన తగిలినంత నాకాంతకు స్వాంతమునఁ బెదురుదోచినది మనం బున బెక్కులూహలు దోచినవి. అయ్యో? ఈసుగతుఁడు నావలన నించుకయు సుఖ మెరుంగకున్నను విశ్వాసముగలవాఁడుంబోలె వెనువెంటఁ దిరుగుచున్నాఁడు. వీనికిని లోకానుభవ మంతగానున్నట్లు తోచదు. నావలెఁ దానును మౌనముద్రయె బూని యుండెను. కాని నన్నేమియు బల్కరించడు నాదాపునకు నేను వగవను గాని నాకతంబుననీతడిందు సమయగలఁడు అది నామది నెఱియఁజేయుచున్నది. ఆభూతము నన్నుఁ జంపి వీనిని విడిచినఁ గడు సంతసింతును అట్లుచేయఁదు అయ్యో? వీనికి సంగతియైనఁ జెప్పితినికానే పాపము గుఱ్ఱుపట్టి నిద్రబోవుచున్నాఁడు. ఆ భూతమువచ్చి క౦ఠము నులిమి చంపునుకాబోలు హరహరా ! ఎంత పాపాత్మురాల నైతిని అని పరితపించుచు మఱియు నిట్లు తలంచెను.

ఇసిరో! నేనెంత నెర్రియూహ చేయుచుంటిని. విధికృతములు నాపైనారోపణ చేసికొనుచుంటినేమి? ఈకల్పన జేసినవాఁడెవ్వఁడు? నన్నీ అరణ్యమధ్యమునకుఁ దీసికొనివచ్చినవాఁడెవ్వఁడు? వాని యుద్యమమేమియో తెలియదు. మాచరిత్రమింత టితో ముగించునో పెంచునోయెఱుక పడదు. జరుగునది చూచుచుండుటయే నాపని. అని తలంచుచు మొదటఁ గలిగిన భయమును జింతయుఁ బాపికొని యా పొన్ని కొమ్మ కొమ్మల సందునుండి వానిరాక నరయుచుండెను.