పుట:కాశీమజిలీకథలు -07.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

234

కాశీమజిలీకథలు - సప్తమభాగము

వులు చూచివత్తముగాక యని పల్ల కీకి వెనుక వెనుకగాఁ జనుచుండిరి. అమ్మహారాజు సూర్యోదయమునకు నుత్తరగోపుర సమీపమున గుఱ్ఱముపై నిలువంబడి యామార్గ ముపైఁ జూడ్కులు వ్యాపింపఁ జేయుచున్నంత.


సీ. కంచుఘంటికయు శంఖంబు లంకే దగిల్చి
                  మూపునవ్రేలాడ ముందువెన్క
    నెమలియీకెలవన్నె లమరంగ మకుటంబు
                  వలెఁదల మెలిపాగ వాసిజెంద
    శంభులింగాంక భాస్వరములౌ నిత్తడి
                  బిళ్ళలంగరములందెల్ల మెఱయ
    మూఁడరల్‌ బిగిజాలు మూతి గల్గినగంత
                 గుడ్డ జోలిని జంకకునుఁ దగిల్చి

గీ. భూతిపైఁ బెద్దగంథపు బొట్టువెట్టి
    పీలికలతోడి మేలియంగీలు గ్రాల
    ప్రాయమెట్టిదొ తెలియంగబడనియట్టి
    జంగ మొక్కఁడు వీటఁబిచ్చంబు గొనఁగ.

పట్టణాభిముఖుండై వచ్చుచుండెను. ఆజంగమువానింజూచిరాజు గుండెఝల్లుమన హా ! విరతీ ? నీకెట్టిగతి పట్టినది. మహారాజు కడుపునం బుట్టియు నీవీబిచ్చగానిం బెండ్లి యాడవలసివచ్చినదా? ఇది యంతయు నీతల్లివలనం గలిగినముప్పుదానికీశాస్తి కావల సినదే. అయ్యో? ఒకరిపైఁ గోపమున నొకరికి నపకారము తల౦పవచ్చునా అక్కటా? ఇందులకు నేనేమిచేయువాఁడ విధిపరిపాక మిట్లున్నదికాబోలు , చేసిన నియమము తప్పుట మహాపాతకముగదా. ధర్మరతియు నిందులకు వ్యతిరేకమునకు సమ్మతింపదు, కానిమ్ము? అట్లే చేసెదనని యారాజు కొంతసేపు శోకము, కొంతసేపు పరితాపము కొంతసేవు క్రోధము. అభినయించుచుఁ దన్నుసమీపించియున్న పరిజనులతో నావచ్చు జంగమదేవరను పల్లకీనెక్కించి యూరేగింపుచుఁ బెండ్లి పందిరికిఁ దీసికొని రండని నియమించి దీనముఖుండై తానంతఃపురమునకుఁబోయి భార్యంగాంచి జరిగిన కథ యెఱింగించి యిప్పుడేమి చేయమనియెదవు? వానికి విరతినిచ్చి పెండ్లి చేయు దువా? అని యడిగిన కన్నుల బొటబొట నశ్రువులుగారఁ బరితాప మభినయించుచు నిట్లనియె మహారాజా! విరతి సన్యాసురాలు దానికెట్టిమగఁడై ననేమి? వత్సునికన్న నెవ్వఁడైన లెస్సయేయని చెప్పితినిగదా. పోనిండు మీ సంకల్పమెట్లో యట్లే జరిగినది. దానికి మంచి మగనిఁ దీసికొనిరాదలంపు మీకుఁ గలిగియున్న నిట్టిప్రతిజ్ఞ యేమిటికిఁ