పుట:కాశీమజిలీకథలు -07.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుశలవులకథ

231

పెండ్లికానిమ్ము వానిచే నీముక్కును జెవులును జెక్కింపకున్న నన్నీపేరఁ బిలువ వద్దు.

ముకుళ - అబ్బో? నీయరచేతికిఁ బండ్లువచ్చినప్పుడు చూతుములే. విరతిని జోగురాలని యాక్షేపించితివికాదా? ఆమాట జ్ఞాపకముంచుకొనుము. ఆజోగురాలి మగనిచేతనే నిన్ను విరూపను జేయి౦పకపోవుదునా?

వకుళ - ఛీ రండా! ప్రేలకుము.

ముకుళ - అని యామాటయే యనిపించుకొనిన గౌరవమేమి.

వకుళ - అమ్మగారి యూతజూచికొని నోటికివచ్చినట్లు ప్రేలుచుంటివి. కానిమ్ము నీవును విరతియు వత్సునివలన నీడుములం గుడుచునప్పుడు నామాట పథ్యముగాఁ దలంపక పోవుదువా.

అని యిద్దఱు పెద్దగాఁ గ్రుద్ధులాడిరి, వకుళ రతియొద్దకు ముకుళ నిరతి యొద్దకుం బోయిరి. కన్నీరుగార్చుచుఁ దనయొద్ద కరుదెంచిన ముకుళం జూచి విరతి ఏమేయిట్లు వెక్కి. వెక్కి యేడ్చుచుంటివి? నిన్నెవ్వరవమానపరచిరి. చెప్పుము చెప్పము అని గన్నీరు దుడుచుచు నడిగిన విని అది యిట్లనియె.

అమ్మా! కుశుఁడు తండ్రిని వశపరచుకొని విద్యారూప పరాక్రమవంతుఁడగు సుకుమారుఁడను రాజకుమారులకు రతినిచ్చి వివాహము చేయుటకు నిశ్చయించెను. వీర్యవంతుఁడను వాని కుమారుఁడు వత్సుఁడనువాడు. వట్టిశుంఠ. దుర్వ్యసనాసక్తుండు కోపశీలుఁడు. విద్యాగంథరహితుఁడు రూపహీనుఁడు అట్టివానికి నిన్నిచ్చుటకు నిశ్చ యించిరట రతి సఖురాలు వకుళ గరువముతో మిమ్మాక్షేపించినది. అందుల కై మాయిద్దఱికిని బెద్దజగడము జరిగినది. తల్లీ! యేదియెట్లైనను వత్సుని నీవంగీకరింప వలదు. అని యావృత్తాంత మంతయు నెఱింగించినది.

విరతి నవ్వుచు ముకుళా! నీకు నాయందుఁగల యభిమానము జూపితివి, మన మెట్టికర్మబీజము నాటుదుమో తదనుగుణమైన ఫలమనుభవింతుము. అంతియకాని మంచిచెడ్డలకు నొరులు హేతువులు కారు. వారి గరువము వారినే చెరుచును. మనల నేమియుం జేయఁజాలవు. ఊరుకొనుమని యోదార్చినది. అంతలోఁ తల్లి యచ్చటికి వచ్చి ముకళ వలన నావృత్తాంతమంతయు విని ఛీ ఛీ వత్సుఁడు నిర్భాగ్యుఁడు వాని కిచ్చుటకు నేనంగీకరింపనని పలికినది. అట్టిసమయమునఁ జంద్రగుప్తుఁ డంతః పురమున కరుదెంచి సుఖాసనోపవిష్టుండై భార్యంజూచి యిట్లనియె.

ప్రేయసీ ! పిల్లలిద్దరికిని వివాహములు నిశ్చయించితిని. వినుము కేయూర దత్తుని నాలుగవకుమారుఁడు సుకుమారుఁడనువాఁడు విద్యా బలరూపశీలములలో నన