పుట:కాశీమజిలీకథలు -07.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

230

కాశీమజిలీకథలు - సప్తమభాగము

నీవును వేదాంతురాలవే కాఁబోలు చాలు చాలు మీయమ్మ శిక్ష చక్కగానున్నది. అని యాక్షేపించుటయు నాచిన్నది తండ్రీ! దేహములు క్షణభంగురములు పుట్టినది మొదలు జంతువులకు మృత్యువు నెత్తిమీఁదనుండి యెప్పుడో గుటుక్కున మ్రింగి వైచును. కావున మంచిమార్గముగ్రహించుటకు నొక సమయము లేదు. చిన్నతనము నుండియే యభ్యసింపవలయును. కామక్రోధాదుల అడఁచుకొని జ్ఞానము గలిగయుండ వలెను. ఎన్నఁడో వృద్దాప్యమునఁ దత్వవిచారణ చేయుదమన్న అంతదనుక మృత్యు దేవత కబళింపక యుండవలదా? మీవాదముసమంజసముకాదని పెద్దగా నుపన్యసి౦చిన రాజునకుఁ గోపమువచ్చి యేమియు మాటాడక వెళ్ళిపోయెను. ఆతండు మరికొన్ని దినములకు కూతుండ్రకు వివాహ ప్రయత్నము గావించుటయు నావిషయముమై వకుళా ముకుళలకును పరిచారకల కిట్టి సంవాదము జరిగినది.

వకుళ - ముకుళా! నీసఖురాలు విరతిని వీర్యవంతుని కుమారుఁడు వత్సున కిచ్చుటకు నిశ్చయించిరఁట. విరతి యంగీకరించినదియా? ఆమెకుఁ దగినమగఁడే దొరకెనులే?

ముకుళ - ఏమి? నీపరిహాసము. అప్పుడే పెండ్లియైనట్లే వెక్కిరించుచుంటివి. మావిరతి వాని నంగీకరింపదు మీరతని కేయూరదత్తుని కుమారుఁడు సుకుమారుని కిచ్చుటకు నిశ్చయించిరా?

వకుళ - అవును సుకుమారుని సౌందర్య మెట్టిదో యిదిగో చిత్రపలకము చూడును. పరాక్రమమున నర్జునుఁడే విద్యచే బృహస్పతిని మించియున్నవాఁడు అన్నిటికి రతికిఁ దగియున్నవాఁడు రతి నతనికిచ్చి సహాయముగా నిందే యుంచు కొందుఁరట పాపము విరతికే మంచి మగఁడు దొరకలేదు.

ముకుళ - పోనిమ్ము నీరతిపతితో సుఖించినంజాలు మా విరతి యవధూతయై పెండ్లియే యాడక యద్వైతానంద మనుభవించును.

వకుళ - మీవిరతి జోగురాలనియే యామెకు మంచి సంబంధమేదియు రాకున్నది. శృంగారలీలాతరంగి తాంతరంగులగు రాజకుమారులు వైరాగ్యప్రవృత్తి గల మత్తకాశిని నెట్లు వరింతుర? వత్సుఁడు గుణహీనుఁడు కావున నంగీకరించెను.

ముకుళ - నీవు కండకావరము జూచికొని మురియుచుంటివి. శృంగారరీలలు బుద్బుదములవంటివి. వైరాగ్యమే నిలుచునది తినఁగూడులేక యత్తవారింట నిల్లరిక ముండుటకు సిద్ధపడుచున్న సుకుమారునూరక పొగడుచురతినభినందించుచు విరతి నాక్షేపించుచుంటివి చాలు జాలు. నోరు మూయుము.

వకుళ - ఏమి? సుకుమారుఁ డన్నములేనివాఁడా? ఈమాట జ్ఞాపకముంచుకో.