పుట:కాశీమజిలీకథలు -07.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుశలవులకథ

229

కుశుఁడు - అన్నా! నీవు చెప్పినదంతయుఁ బుస్తకములలో వ్రాయఁబడి యున్నది. నిజము చూచినవారెవ్వరును లేరు. సుకృత మనియు దుష్కృతమనియు బెదరింపుమాటలు సత్యములుకావు. వెఱ్ఱి ఛాందసము విడిచి సుఖింపుము

లవుఁడు - ఛీ: బాలిశా నాస్తికా! వాదము చేయుచున్నావు. నీతో సంభాషింప రాదు.

కుశుఁడు - (పకపకనవ్వుచు) అన్నా కోపము వదలమని చెప్పుచు నిప్పుడే కోపము జెందుచుంటివేమి? ఇట్లే అందఱు జెప్పుచుందురు కాని చేయువారు లేరనియే నే ననుచుంటిని వినుము.


శ్లో. కామః క్రోధశ్చ లోభశ్చ సర్వేదేహగతాగుణాః
    రాగద్వేషా దయోభావాస్సర్గెపి ప్రభవంతిహీ

కామక్రోధాదులు రాగద్వేషాదులు స్వర్గమందున్ననువిడుచునవికావు. దేవతల కవి పోయినవియా?

లవుఁడు - అక్కటా! నిక్కము దెలియక నీవిటు దుర్మార్గము ననుసరించు చుంటి వేమిజేయుదును.

కుశుఁడు - నీదియే దుర్మార్గము. నాదికాదు తెలియ కట్లను చున్నావు.

అని యీరీతి అన్నదమ్ములిద్దరు పెద్దతడవు వాదించిరి. విరతిలవునిపక్షము రతి కుశునిపక్షము జేరినది. తగవులు చివరకుఁ దండ్రికిం దెలిసినవి. కుమారుల నిరువుర రప్పించి వారి సంవాదప్రకారమంతయు విని పండితుల రప్పించి సభజే యించి యెవ్వరివాదము న్యాయమైనదో చెప్పుఁడని కోరుటయు ద్రవ్యలాలసులగు నీపండితులు కుశుని దుర్భోధచేఁ గుశుని వాదమే సత్యమైనదని నిర్థారణచేసిరి.

దానంజేసి లవుండు కోపించుచు దుర్జనభూయిష్టమగు దేశంబున నుండఁగూడ దని తలంచి యెవ్వరికిం జెప్పకుండ నొకనాఁడు దేశాంతరము లేచిపోయెను.

కొన్నిదినంబులకు నృపతి యవ్విధం బెఱింగి యంతిపురి కరిగి భార్యతో నావిషయము ముచ్చటించుచు నీవు బిడ్డల సన్యాసులంజేసితివి, లవుఁడు విరక్తుడై తమ్మునితో వెఱ్ఱివాదముజేసి యెందో పోయెను. వానికొఱకు దేశమంతయు వెదకించు చున్నాను. వానివృత్తాంతము నీవేమైన నెఱిగుఁదువా అని‌ అడిగిన విని ధర్మపత్ని నిట్టూర్పు నిగుడించుచు నేమియు మాటాడినదికాదు. విరతి తండ్రితో బాబా ! చిన్న న్నయు అక్కయుఁ బెద్దన్నతో నాస్తికవాదము జేసిరి. నీవును వారితోఁగలిసి పండితులచే నావాదమే యుక్తమైనదని నిర్దారణచేయించితివి. దాన౦జేసి వానికిఁ గోపము వచ్చి యిందుండుట కిష్టములేక లేచిపోయెనని చెప్పిన విని తండ్రి యోహో!