పుట:కాశీమజిలీకథలు -07.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

228

కాశీమజిలీకథలు - సప్తమభాగము

స్వప్నమందుండియే మేల్కొంటినని తలంచుచు వేరొకస్వప్నమునుగాంచు మూఢుని పగిదిఁ గొందఱు లోకాంతరగమనమే ముక్తియని తలంతురు. అట్టివారిం గాంచి అద్వైతవాదులు నవ్వుచుందురుగదా అనిమండనమిశ్రుఁడు అధ్వైతబోధనయైన పిమ్మట శంకరాచార్యునిస్తుతియించెను. తెలియనివాఁ డందఱి నాక్షేపించును. నీవు గ్రంథముల బాగుగా విమర్శించి శాస్త్రరహస్యముల గ్రహింపుము. గురువుల నాక్షే పింపకుము. మన తల్లి వినినఁ గోపించునని పలికిన విని నవ్వుచు గుశుం డిట్లనియె.

అన్నా ! నీకేమన్నను గోపము వచ్చునుకాని నామతము దెలిసికొనలేకున్నావు. గ్రంధములలో వ్రాయలేదని నేజెప్పలేదు. అట్లునడుచువారు లేరని చెప్పుచుంటిని. నడిచినం బ్రయోజనములేదు. దేహసుఖంబులనుభవింపక యీనాలుగుదినములు పురమువిడిచి అడవులం దిఱుఁగుమనియెదవాయేమి? ఆకాశ కుసుమమువలె దేహానం తర మేమిజరుగునో యెవ్వఁడు చూచెను. మరణానంతరమందిట్లు జరుగునని నిశ్చయ ముగాఁ జెప్పినవాఁడులేడు పూర్వగ్రంథములలో నిట్లువ్రాయఁబడియున్నదని ప్రతి మహర్షియు నుదాహరణములు చూపుచుందురు. కావున నీవు వెఱ్ఱివేదాంతము పెట్టు కొనక స్వేచ్చగా నింద్రియ సుఖంబు లనుభవింపుము. మనకీసమయమున వేదాంత మవసరములేదని యుక్తియుక్తముగా వాదించెను.

లవుడు - ఓహొహో! నీబుద్ధిబలము కొనియాడఁ దగినదే క్షణభంగురమైన యీశరీరమునకు సుఖంబేదియో నిరూపింపుము.

కుశుడు - ఏయింద్రి యమేసుఖంబనుభవించుటకు భగవంతుఁడు సృజించెనో యా యింద్రియముద్వారా నాసుఖం బనుభవింపవలయును. తెలిసినదియా!

లవుఁడు - సుఖంబననేమి?

కుశుడు - ఇంద్రియానందము.


లవుఁడు శ్లో. అవిశ్రాంత మనాలంబ మపాధేయ మదైశికం
                తమకాంతా రమధ్వానం కథమేకో గమిష్యసి
                సహిత్వాం ప్రస్థితంకశ్చి త్పృష్ఠతోను గమిష్యతి
                సుకృతం దుష్కృతం చత్యాంయాస్యంత మునుయాస్యతి.

మూఁఢుడా ! విశ్రాంతి శూన్యమైపాదేయరహితమైయనంతమై యొప్పు మార్గం బునం బడి నీవు పోవుచుండ నీవెంట నెవ్వరును రారుసుమీ? నీవొక్కఁడవే పోవలయు నప్పుడు నీయింద్రియములు నిన్ను రక్షింపఁజాలవు. నీవుజేసిన సుకృతదుష్కృత ములు మాత్రము నీవెంటవచ్చును. కావున సుకృతములాచరింపుము. చెడుబుద్ధి విడువుము.