పుట:కాశీమజిలీకథలు -07.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

కాశీమజిలీకథలు - సప్తమభాగము

బుల బొందియు మనవలె స్థిరులై యుండరు. ఇందులకు మహాభీషుండే సాక్షి అని ప్రత్యుత్తర మిచ్చెను.

అప్పుడు నారదుఁడు అక్కటా ! వీరు తమకు రాఁబోవు నిక్కట్లు తెలిసికొన లేక మానవులకై చింతించుచున్నారు. అయ్యో! ఆకథ వినిననెంత పరితపింతురో, ఏమిచేయుదును? ఆ మాట నా నాలుకను నిలువ కున్నది. ఇఁక దాచలేను. చెప్పదనని యాలోచించుచున్నతరి ధరుండు స్వామీ ! మీ మానసమం దేదియో ధ్యానించుచున్నారు. ఎవ్వరి విషయము. నామాటకు సదుత్తరం బీయరైరి. అని అడిగిన నారదుండిట్లనియె.

వసూత్తమా? మీరు దేవతలమని గర్వించి బ్రహ్మర్షివరేణ్యుండైన వసిష్ట మహాముని యాశ్రమమున కరిగి యవ్వన ముద్యాన వనముగాఁ దలంచి పుష్పాపచయాది క్రీడలఁ గావించి విచ్ఛిన్నము జేసితిరఁట నిజమేనా?

అంతటితో విడువక యమ్మునిసత్తముని ప్రాణ సమమగు హోమధేనువును శిష్యుఁడు వలదనుచుండ బలత్కారముగాఁ దీసికొని పోయితిరఁట. ఇది యేమి యాగడము ? మీ బుద్ధులు సురిగిపోయి నవియా యేమి ? మీ దేవభావము ఋషులకడఁ జూపఁదగినదియా ? అయ్యో ? హాయిగా విమానము లెక్కి సంచారముజేయు సుఖమంతయు పాడుజేసి కొంటిరే అని పలికిన విని యులికిపడుచు ధరుఁడు స్వామీ ! ఆయనకు మాపైఁగోపము వచ్చినదా యేమి. నేను వలదని చెప్పుచునేయుంటిని. భార్యాలోలుండైన ప్రభాసుని మూలమున నాపని చేసితిమి ఇప్పుడు య మ్మొదపు నాముని సదనంబునకుఁ దీసికొనిపోయి యర్పింతుమా? మీ మాటలు విని మాహృదయములు బేదిల్లుచున్నవి? అక్కడ నేమి జరిగినదియో వివరించ మనుటయు నారదుం డిట్లనియె.

ఏమని చెప్పుదును. చేయు గాలిన వెనుక నాకు పట్టిన లాభమేమి ? వినుండు. ఇంతదనుక మీరు దురంత దుఃఖభాజనమని నిందించిన మనుష్యలోకములో జనించు నట్లు వసిష్ఠుఁడు మిమ్ము నందఱ శపించె తెలిసికొంటిరా ? అని చెప్పినంత హాహాకారముతో నందఱు మూర్ఛ నొందిరి.

అప్పుడు నారదమహర్షి వారినెల్ల నోదార్చుచు వసువులారా ! మీరెన్నఁడు నిడుముల గుడిచి యెఱుంగరు కుడిని కూర్చుండి యీ యాపద దెచ్చుకుంటిరి. హరిహర బ్రహ్మలకైనఁ దాపసశాప మనుభవింపక తీరదు. తొల్లి విష్ణుండు ముని శాపతప్తుం డగుట వినలేదా ? పెక్కులేల మీ యెకిమీడుఁ గౌతమశాపతప్తుండై సహస్రాక్షుండగుట త్రిలోక విదితముకాదా ? చేసిన కర్మకు ఫలం బెంత వారికిని గుడువక విడువదు.