పుట:కాశీమజిలీకథలు -07.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

226

కాశీమజిలీకథలు - సప్తమభాగము

నేరఁడు మఱియు రాజునకు బరిచారకులు లేనిచో వ్యాపారము లెట్లుసాగవో దేహికిఁ గామక్రోధాదులువిడిచినచో దేహయాత్రయే సాగదు. కోపములేని వాని నెవ్వరుమన్నిం పరు. కోపమనునది యాయుధమువంటిది దానిని దేశకాలానుగుణ్యముగా వినియోగింప వలయుంగాని విడువమనుట యసామర్థ్యమును సూచించెడిని కామము లేకున్న జన్మమే నిరర్దకము.

మఱియొక విశేషంబు వినుండు. కామ క్రోధాదుల విడచినవారు పూర్వము కాని యిప్పుడుగాని యెవ్వరేని గలరేమో నిరూపించి చూపుఁడు పురాణములు శాస్త్ర ములన్నియు విడువవలయు ననిమాత్రము ఘోషింపుచున్నవి. ఆకలములు దినియెడి మునులు విడిచితిరా? పరాశర మహర్షికధ యించుక విమర్శింపుఁడు. యమునానదిని దాటునపుడు ఓడనడిపెడు పల్లెదానిజూచి కామాతురుండై క్రీడింపఁడే అందులకుఁ గారణమాచిన్నది యొంటరిగా నుండుటయేగదా? దాని కితరపరము లెన్నేని యిచ్చెను గాని తనకామ మడంచుకొనలేక పోయెను. వారువ్రాసిన ధర్మశాస్త్రము కామాక్రోదా దుల విడువుమని యిప్పుడు ఘోషింపుచున్నవి. వ్యాసుని చరిత్ర మనము వర్ణించిన బరిహాసాస్పదమే భాతృభార్యలవిశ్వస్థల సంతానవతుఁలఁగావించి మహాభారతము రచిం చెను. విశ్వామిత్రాదుల కామక్రోధములు లోక విదితములేకదా? వసిష్టునందుఁగల వైరంబునంచేసి హరిశ్చంద్రుని నానాకష్టములంగుడిపించెను రాజ్యాభిలాషులగు నృపులమాట చెప్పనేల? తండ్రీ! అంతయేల? తత్వశాస్త్రమంతయు సాంగముగాఁ జదివిన మీరు కామాక్రోధాదుల విడిచితిరా? వేతనము. బుచ్చుకొని మాకుపదేశము జేయుచుండిరి. ఇఁక మేమెట్లువిడుతుమో చెప్పుఁడు. మాతల్లి వెఱ్ఱియె కాని మాకీప్రాం బున నీయుపదేశ మేమిటికి? బాపురే? అద్వైతమఁట. అదియెవ్వరికైనం దెలియు నదియే? అది దేహియాచరించుటయెట్లు? శాస్త్రకారుల కేమియుం బనిలేక ప్రజలం బాధించుట కిట్టివి వ్రాయుచుందురు. అందఱు వేదాంతులై జన్మరాహిత్యమునే కోరి నచో నీప్రపంచకము శూన్యమైపోవును సూర్యచంద్రాదులు‌ పంచభూతములు మఱి యెవ్వరి కుపయుక్తములు? సృష్టికర్తచేసిన పనులన్నియు వ్యర్థములై పోవునుగదా? కావున మాకిట్టి యుపదేశమెన్నఁడును జేయకుఁడు, లోకోపకారములగు గ్రంధ ములుపదేశింపుఁడు అని గురుని వాదము ఖండించుచుఁ బెద్దగా నుపన్యసించెను.

ఆరాజకుమారుని యుపన్యాసము విని తెల తెల్లబోవుచు లవుని మొగము జూచి నీయభిప్రాయమేమని యడిగిన నంతడు గురునకు నమస్కరించుచుఁ గురు నుద్దే శించి తమ్ముడా? నీవిట్లు చార్వాకమతము ననుసరించి వాదించుచుంటివేల? కామక్రోధా దుల విడువుమని చెప్పిన శాస్త్రకారులంత మూఢురా? ఏమి నీయవివేకము? వినుము. అజ్ఞానమువలన శరీరము గలుగుచున్నది.