పుట:కాశీమజిలీకథలు -07.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

29]

కుశలవులకథ

225

చుండును. అమ్మ త్తకాశినియు భర్త చిత్తవృత్తియరసి అయ్యో యీతండు సకలవిద్యా పారంగతుడయ్యుఁ బ్రవృత్తి మార్గనిరంతుండయ్యెఁ గొంతకాల మరిగినంగాని వీరిబుద్ది మరల్చవశముగాదు అని తలంచుచు నతని మనసు దెలిసి క్రీడింపుచుండెను.

అట్లుండఁగా క్రమంబున నయ్యంబుజాక్షికి నిరువురు మగపిల్ల లును, నిద్ద రాఁడుపిల్లలును జంటగా నుదయించిరి. మగవారికిఁ గుశలవులనియు నాఁడువారికి రతివిరతులనియుఁ బేరులు పెట్టిరి. అందు లవునకును, విరతికినిఁ తల్లి పోలికయుఁ గుశు నకుఁ రతికినిఁ దండ్రిపోలికయు వచ్చినది.

దివ్యాకారభాసురులగు పిల్లలంగాంచి భూవల్ల భు డుల్లమున నానంద౦బు వెల్లివిరియఁ దదీయక్రీడాలాపములతోఁ గాలక్షేపము జేయుచు యుక్తకాలంబున వారి నందఱం జదువనేసెను.

అక్షరజ్ఞానము గలిగినది మొదలు కావ్యములు, నాటకములు, శాస్త్రములు, సంగీతములు, దండనీతి, వ్యాయామము ధనుర్విద్య లోనగు విద్యలెల్లఁ జెప్పుటకు నారాజు వారికి వేరువేర గుంపుల నిరూపించెను. గంటకొక గురువు వారికి విద్యలం గఱపుచుండెను. సూక్ష్మబుద్ది గల పిల్లలు నొజ్జలవలన గళావిశేషముల నతిలాఘవ ముగా గ్రహింపుచుండిరి.

రాజపత్ని భర్తకుఁ దెలియకుండ వారికి వేదాంతవిద్య నుపదేశింప వేరొక గురువును నియోగించినది. తత్వశాస్త్రము నాతనియొద్ద నలువురు జదివికొనిరి. కాని లవునకును విరతికిని లెస్సగాఁ బట్టుబడినది. కుశుఁడును రతియు అందలి విషయం బులఁ బరిహసింప మొదలు పెట్టిరి.

ఒకనాఁడు గురుఁడు ప్రబోథచంద్రోదయమను వేదాంతనాటకము వారికిఁ బాఠకముగాఁ జెప్పి అందలి విషయంబు లుపన్యసించుచుఁ గామక్రోధాదులు పరమ శత్రువులనియు శమదమాది గుణములచే వాని నడఁగద్రొక్కి వివేకముగలిగి వర్తించినచో మోహముడిగి యాత్మప్రబోధమువలన ముక్తులయ్యెదరని యెఱింగించిన నవ్వుచుఁ గుశుండిట్లనియె.

ఆచార్యా ! మీరెఱింగించిన విషయంబులు చెప్పుటకు వినుటకును జాల నింపుగా నుండును. అట్లాచరించువా రెవ్వరునులేరు. దేహధారు లాచరింపనులేరు, శరీరికిఁ గామక్రోధాదులు ముఖ్యముగా నుండవలసినదే? సృష్టికర్త వస్తువును సృష్టించునప్పు డుపయోగశూన్యమైన గుణమేమిటికి జేసెడిని చెఱుకునకుఁ తీపిగలిగించినట్లే వేమునకుఁ జేదుగల్పించెను. మేము స్వయముగా నాగుణము సంపాదించుకొనలేదు సహజంబైన యాగుణమును వదలనులేదు. అట్లె కామకోధాదులు సహజములు అవి లేక దేహముండ