పుట:కాశీమజిలీకథలు -07.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

224

కాశీమజిలీకథలు - సప్తమభాగము


    కోపోపాహితబాష్పబిందుతరళం రమ్యం ప్రియాయా ముఖం
    సర్వం రమ్య మనిత్యతాముపగతె చిత్తైన కించిత్పునః.

మనోహరా ? వెన్నెలరాత్రులు మలయమారుతములు లతామంటపములు శృంగారచేష్టలు కధలు ప్రియురాండ్రమొగములో నగునవి యన్నియు రమ్యము లనియే చెప్పఁదగినది. కాని భూతములయొక్క యనిత్యత దెలిసినచిత్తమునకివి యేమియు రుచింపవుసుడీ అనిపలికిన నాఱేఁడు చాలు చాలు వృద్దులాడు మాటలాడు చుంటివేమిటికి? వికసించియున్న యీపలాశకుసుమ మెట్లున్నదియో యుత్ప్రేక్షింపుము అనుటయు నవ్వనితారత్నము విద్యారహితుల సౌందర్యము దర్శనీయమైనను స్తోత్ర పాత్రము గాదని పరిమళశూన్యములగునీపూవుల దెలుపు చున్నవని యుత్తరముజెప్పినది.

అతండప్పుడు ఔరా? నీదారి మారిపోవుచున్నది. వినుము “సీ. పూచె మోదుగులు సొంపుగఁగానలచ్చికిఁ జైత్రుఁడుంచిన నఖక్షతములనఁగ” సరిగానున్న దియా? అని యడిగిన నప్పడఁతి యప్రతిహత ప్రతిభగల మీ వాక్యమునకుఁ దప్పులు పట్టువారెవ్వరు? అని యుత్తరముఁజెప్పినది. ప్రేయసీ! పండుటాకురాలిచి కొత్త చిగురు ధరించిన యీ గున్నమామిడిచెట్టు శోభయెట్లున్నదియో చెప్పుమనుటయు నాజవరాలు -


గీ. తను విపాతంబుగ్రాగ నుత్పత్తి మరల
   గలుగు దేహుల కిట్లని తెలుపుచుండె
   పండుటాకులు రాలినపట్ల మరల
   చిగురులెత్తుట సృష్టివైచిత్ర్యమిదియె.

అని పలికిన విని నవ్వుచు నానృపాలుఁ డట్లుకాదు వినుము.

గీ. పండుటాకు రాల గన్పండువుగను
   మొలకలెత్తెడు పల్ల వములు నెలంత
   ప్రాతనగలను విడిచి హొంబట్ట క్రొత్త
   భూషణంబుల గైసేయు పొలుపుదోచె.

అట్లు భర్త శృంగారలీలాతరంగిణి తాంతరంగుండై పలుకుచుండ నయ్యండ జయాన వైరాగ్యోదయ సూచకములగు మాటలచే నుత్తరము జెప్పుచుండియు నొచ్చు నేమోయని కమ్మర నమ్మనుజపతి సమ్మోదమందునట్లు సంభాషించుచుండెను.

నృపతియుఁ దన సతి విరక్తియెఱింగి అయ్యో? యీతొయ్యలి యనన్యసా మాన్య సౌందర్యాభిరామయయ్యు శృంగార విలాసలాలస గాక విరాగిణియైయున్నది దీనిబుద్ధి మరల్పవలయుననితలంచి శృంగార ప్రబంధములు దెప్పించి చదివింపు