పుట:కాశీమజిలీకథలు -07.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుశలవులకథ

223


132 వ మజిలీ

కుశలవులకథ

అయ్య వనధంబొక పట్టణము అందలి వింతలం జూచివచ్చి గోపకుమారుండు మణిసిద్ధునకు నమస్క రించుచు స్వామీ ! యిన్న గరంబున నొక చతుష్పధంబున నొక శిలావిగ్రహము గలదు. దాని ఫాలభాగంబున వికటదంతుఁడని వ్రాయఁ బడియున్నది. దంతములు నిమ్నోన్నతములుగా నుండ టంబట్టి యట్టిపేరు పెట్టియుందురు. అది యొకవింతగాదు వినుండు. ఆవీధిని వచ్చుచుపోవువారెల్ల నావిగ్రహముపై నుమిసి పోవు చుందురు. అందుల కారణమేమియో తెలిసినదికాదు. మీవలనం దెలియఁగోరి వేగముగా వచ్చితిని. తత్కారణంబరసి యావృత్తాంత మెరింగింపుఁడు నేడింతకంటె వేరొకవింత గనంబడలేదని ప్రార్థించిన నాయోగిపుంగవుండు మణిప్రభావంబునఁ దత్కధావిశే షంబాకలించుకొని యిట్లు చెప్పందొడంగెను.

వత్సా ! విను మిప్పురంబునకుఁ బూర్వము కాంచీపురంబని పేరుగలదు. ఇందుఁ బూర్వము చంద్రగుప్తుండను రాజు ప్రజలం బాలింపుచుండెను? అతనికి ధర్మపతి యను భార్యగలదు ఆమె సుగుణంబులు గణనాతీతంబులు సంతతము వేదాంతగోష్టి జేయుచుండెను. మిక్కిలి చక్కనిది. సౌభాగ్యమునకే యలంకారప్రీతి భోగేచ్చబూ నదు. భర్త ప్రవృత్తి నిరతుండగుట నతని మనసు రంజించునట్లు మాట్లాడును.

ఒక వసంతకాలమున నానృపాలుండు భార్యతోఁ గూడ బహువిధ కుసుమఫల దళ విలసితంబగు నుద్యానవనంబున కరిగి యందలి విశేషంబులు భార్య కెరింగించుచు విహరించెను.


చ. వరలు వియోగినీ విరహవహ్నికి నాహుతివేల్చఁ బొల్చు భా
    సుర సహకారమంజరులుచూచి మడించెఁ బికంబులి త్తరిన్
    సురత పరిశ్రమాతిశయ సూదనముల్‌ విహరించెఁ బాటలీ
    పరిమళ బారచోరములు బంధుర చందనశై లవాతముల్‌.

మనోహారిణీ ! యీ వసంతకాలములో నీవెన్నెల రాత్రులందు మలయమారుత ములు మేనికి హాయిసేయ విలాసాలసలగు కిసలయ పాణులతో లతామంటపములఁ గ్రీడించు పురుషుల కిందఁభోగములేమిటికి? అనుటయు నాతరుణి చిఱునగవు మొగము నకు నగయై మెఱయ భర్తకిట్లనియె.


శ్లో. రమ్యాశ్చంద్రమరీచయ స్తృణవతీ రమ్యావనాంతస్థలీ
    రమ్యం సాధుమహాసమాగతసుఖ౦ కావ్యేషు రమ్యాః కధాః