పుట:కాశీమజిలీకథలు -07.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

222

కాశీమజిలీకథలు - సప్తమభాగము

రాజుల వాక్కులు పద్మిని‌ పాతివ్రత్యము గొనియాడుచు సురూపుని నిందింపఁ దొడఁగి నవి.

అప్పుడు చక్రవర్తి సభ్యుల కలకలము వారించుచు ప్రతినిధిని తగ్గించి మృగ దత్తుని రామదుర్గనగరాధీశుని గావించితిమనియు సుమేధునికిమఱి నూరుగ్రామముల కధి కారమిచ్చితిననియుఁ బద్మిని చరిత్రము గ్రంధముగా వ్రాయించిదేశమున వ్యాపింపఁ చేయ నాజ్ఞాపించితిమనియు రత్నాంగి తప్పు మన్నించి దానికైన ఖర్చులన్నియు నిప్పించితిమనియు నున్నతస్వరంబున నుపన్యసించి సభ్యుల కానందము గలుగఁ జేసెను. జయజయధ్వానములతో సామాజికులు కరతాళములు వాయించిరి. అంతటతో సభ ముగిసినది

శుభముహూర్తమున మృగదత్తుని సామంతరాజులతో గూడుకొని చక్రవర్తి రామదుర్గనగరమునకు పట్టభద్రుని గావించెను. గురుదత్తుఁడు తల్లి దండ్రుల రప్పించి విద్యానగరమునవసించి రాజ్యపాలనము గావింపుచుండెను.

గోపా!


ఉ. భూపతిజంపితిన్మగఁడు భూరిభుజంగముచేతఁజచ్చెఁ బై
    నాపదఁ జెందిచెంది యుదయార్కుని పట్టణమేగి వేశ్యనై
    పాపము గట్టికొంటి నఁటఁపట్టి విటత్వముబూనిరాగ సం
    తాపముజెంది యగ్గిపడి దగ్ధముగాకిటు గొల్ల భామనై
    యీపని కొప్పుకొంటి నృపతీ! వగ పేటికి? చల్డ చి౦దినన్‌.

ఇందు మంచికథ పొడగట్టుచున్నది. తద్వృత్తాంత మెరింగింపుమని యడిగితివి విమర్శింపనట్టి కథయే యున్నది. తెల్లముగాఁ దెలిసినదియా అని యడిగిన వాఁడు స్వామీ ! మీదయవలన నాకు గ్రహణశక్తి పెరుగుచున్నది. ఈకథ నామనసున కెంతేని వింతగా నున్నది పద్మిని పాతివ్రత్యము సర్వయువతీజన స్తుత్యమైయున్నది. ధర్మ మును విడువనివారెన్ని యిడుములు గుడిచినను తుదకు సుఖింపక మానరు. అను నీతి దీనివలనం దెల్ల మైనదని పలుకుచు గురువుతోఁ గూడ నా శిష్యుండు కావడి మోచుకొనుచుఁ దదనంతరావసధంబు జేరెను.