పుట:కాశీమజిలీకథలు -07.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

218

కాశీమజిలీకథలు - సప్తమభాగము


    గదాధరారోహం సుగధాధరస్త్యం.
    సమానధర్మాత్ప్ర వదంతిసఖ్యం.

క. బోధపడ నేరదించుక
   సాధులకేగాని మాప్రసంగంబులు సుమే
   ధా ధారిత భువనభరా
   సాధితపంచేద్రియ ప్రచార సుమేధా !

క. కోరఁ గనకాంబరాలం
   కారధరా వాహనాది కామ్యములనినున్
   భూరమణ! యాత్మముక్తి వి
   చారేచ్చన్ వచ్చినాడ సందర్శంపన్.

సుమేధుఁడాపద్యంబులఁ జదివికొని పరమానంద పూరితహృదయుండై యర్ఘ్యపాద్యాదికములఁ గైకొని యెదురువోయి పాదములు గడిగి శిరంబునఁ జల్లి కొనుచు మహాత్మా ! నేఁ డాత్మదార గృహయుక్తముగా భవదాగమనంబునఁ గృత కృత్యుఁడనైతి. నిన్నుఁ బరమమిత్రునిగాఁ దలఁచుచున్నవాఁడ దయజేయుఁడు. మీతో నాత్మరహస్య విశేషంబుల ముచ్చటింపవలసియున్నది యేకాంతప్రదేశమున కరుగుదము రండు. అని పలుకుచు సౌధాంతరమునకుఁ దీసుకొనిపోయి సుఖాసనా సీనుంగావించెను.

సముచిత వస్త్రాలంకారశోభితుండగు సుమేధుంజూచి గదాధరుఁ డెగాదిగ జూచుచుఁ గురుదత్తుఁడు కాదుకదా యను భ్రాంతి హృదయంబున నంకురింప నేమనిన నేమి అపరాధమో యని వెరపుగదుర నేమియు మాటాడకూరకుండెను.

కొంతదనుక సుమేధుఁడును మౌనముద్రవపాంచి పండితప్రవరా! నీయాగ మనకారణమెఱింగింపక ధ్యానించుచుంటివేమని యడుగుటయుఁ గ్రమంబునఁ దన యనుమానము వృద్ధినొంద నిట్లనియె.

దేవా! నాకు మొదటగలిగిన సందియముకన్న మిమ్ముజూచుటచే వేరొక సందేహముఁగలుగుచున్నది వినుండు జీవులకు నభిఖ్యాంతరంబుగలిగినను నాత్మ భేదము గలుగదుకదా? దానంజేసి మన యిరువుర మునొక్కటియేయనినాయభి ప్రాయముఅనియుపస్యసించిననతండిట్లనియె

మీరు శాస్త్రవేత్తలుగదా! మీయభిప్రాయమునకు సత్యమునకు భేదముండదు, మీమాటయే యదార్థమని నేను నొప్పుకొనియెదననపుఁడు నట్లైన నున్న రూపు దెలుపుట కేమికొదవ అని చెప్పెను.