పుట:కాశీమజిలీకథలు -07.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

216

కాశీమజిలీకథలు - సప్తమభాగము

పుష్ప --- న్యాయవాదులు తనపక్షముఁ జెప్పిన నుత్తముడందురు. లేకున్న ననుత్తముఁడందురు. మనకును వారికిని భేదములేదు.

రత్నాంగి - పోనిమ్ము. ఏమిజేసినను సరే. యేటో యొకటి తెలిసినం బాగుండును. రేపురేపని త్రిప్పి చంపుచున్నారుగదా ?

పుష్ప --- తిరుగా నెప్పుడు విచారింతుమనిరి.

రత్నా --- ఎప్పుడో తెలియకయే న్యాయవాది యింటికి దూతిక నంపితిని. అదిగో అది వచ్చుచున్నది.

దూతిక - (ప్రవేశించి) అబ్బా! న్యాయవాది యింటికి వెళ్ళువరకు నాకాళ్ళు ముక్కలగుచున్నవి. ఆయనయే వేగము మాట్లాడును గాని వారి గుమాస్తాలు తల యెత్తి చూడనే చూడరు. అభియోగము తెచ్చుటకంటె పాపములేదుకదా !

రత్నా - ఏమైనది ? ఎప్పుడని చెప్పిరి.

దూతిక - మనవ్యవహారము చక్రవర్తిగారు స్వయముగా విచారింతురఁట. ఉదయార్కుని గూడ రమ్మన్నారఁట ఎల్లుండి విచారింతురట. ఎల్లుండి పెందలకడ రమ్మని న్యాయవాదిగారు చెప్పినారు. సరేకదా వారికియ్యవలసిన సొమ్ముకూడా తెమ్మన్నారు. సొమ్ము లేకుంటె తాను రాడఁట. గుమాస్తాల బహుమతులు కూడా ఇవ్వాలట.

రత్నా --- సరిలే ఇయ్య కేమి చేస్తాము.

పుష్పవేణి - ఇంతకు మీపక్షమయ్యేటట్లున్నదా ?

రత్నా -- చక్రవర్తి విచారించునంట. ఈసారి న్యాయముచేయవచ్చును.

పుష్చ --- మృగదత్తుఁడువచ్చి సాక్ష్యమిచ్చినాడుగదా ? వారి సాక్ష్యమెట్లున్నది.

రత్నా --- వాఁడుబలుటక్కరి. గడియకొక పేరు చెప్పుచున్నాడు. రామదుర్గ నగరమునుండి వచ్చిన బంట్రోతులు ఏడ్చుచున్నారు. ఏదియో బ్రతిమాలుకొను చున్నారు వివరము నాకుఁ దెలియదు.

దూతి - నాకుఁదెలిసినది అందులకే చక్రవర్తి స్వయముగా విచారింతురఁట వినుము. ఈమృగదత్తుఁడు మఱియేదో యపరాధముచేసి శిక్షింపఁబడి తనపేరుతో మరియొకరిని వారి కప్పగించెనఁట ఈసమయమునకే యా యభియోగము విచారణకు వచ్చినది. ఒకే పేరుగలవారు రెండువిధములుగా వచ్చుటచే నందరు వింతగాఁ జెప్పు కొనుచున్నారు. ఇప్పుడు న్యాయవాదిగారి యింటికడ బలువురు కూర్చుండి యా మాటయే చెప్పుకొనుచున్నారు. అని వాండ్రు ముచ్చటించుకొనుచుఁ దత్కా లము నిరీక్షించియుండిరి.