పుట:కాశీమజిలీకథలు -07.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పద్మినీ గురుదత్తుల సమ్మేళనము

215


131 వ మజిలీ.

పద్మినీ గురుదత్తుల సమ్మేళనము

పుష్పవేణి - రత్నాంగి ! నీయభియోగ మీదినమున విచారింతురా? పాపము పెక్కుదినములనుండి తిరుగుచున్నావుగదా ?

రత్నాంగి -- ఛీ ! ఛీ ! ఎరుఁగక దీనిలో దిగితిని సొమ్ముపోతే పోయినది. రామరామ ఒక్కనికి జాలిలేదుగదా న్యాయవాదివచ్చునప్పుడెల్ల సొమ్ము తెమ్మనియే పీడించును. వానిక్రిందివారు డబ్బు చేతిలో వేసినంగాని కాగితమే వ్రాయరు. ఈ బంట్రోతుల కియ్యలేక చేతులు కాయలు కాచిపోవుచున్నవి. అధికారులు త్రిప్పి త్రిప్పి చంపుచున్నారు. అబ్బబ్బా ! నాలంజరికపుసొమ్మంతయు వీరి లంచముల క్రింద సరిపడిపోవుచున్నది. సుమేధుఁడు మహాజితేంద్రియుండని పొగడితివి. అతడుఁ స్త్రీలోలుండని తెల్లమైదిగదా ?

పుష్పవేణి - ఆమాటకు మాత్రము నేనొప్పుకొనను. అతండు పరస్త్రీ వర్జితుఁడని నేను శపథముజేసి చెప్పఁగలను.

రత్నాంగి -- చాలుచాలు నీమాటనమ్మియే నేనాప్రయత్నము చేసితినికాను. లేకున్నఏపాటికివాని నాగౌఁగిటలో వేసికొని నాపక్షమున తీర్పు చెప్పించుకొనక పోపుదునా ?

పుష్ప -- నీవెట్లు తెలిసికొంటివి?

రత్నా - వినుము. ప్రతిదినము అతఁడు గుఱ్ఱమెక్కి ప్రొద్దున విహారమునకై పోవుచుండును. గుఱ్ఱము వాఁడొక్కడుమాత్రము వానితోబోవును సమయము వచ్చి నప్పుడు నామాట జెప్పుమని వానికి లంచమిచ్చియుంటిని వానివలన నిజము తెలిసినది.

పుష్ప -- వాఁడేమి చెప్పెను.

రత్నా -- మొన్న ప్రొద్దున్నఁ బోవుచుండగాఁ జక్కని గొల్లది పెరుగుకుండ నెత్తిమీఁదబెట్టుకొని యమ్మ వచ్చుచుండఁగా దాని మోహించి వానిఁబొమ్మని దాని తనయింటికిఁ దీసికొనిపోయెనఁట. వాఁడీరహస్య మెవ్వరికిని జెప్పవలదని నాతోఁ జెప్పెను. ఈమాటైన నమ్మెదవా ?

పుష్ప -- వాఁడెందులకుఁ జెప్పెనో కాని నేను నమ్మజాలను.

రత్నా -- ఇంతయేల విచారణలోఁ బక్షపాతము చేయుచున్నాడని మా న్యాయ వాదియే చెప్పెను.