పుట:కాశీమజిలీకథలు -07.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అపరాధవిచారణ కథ

213

యించెను. అప్పుడప్పడంతి పురషసాన్నిధ్యంబునకు వెరచుచు నుపాయాంతరము లేమి౦జేసి‌ కుండ యెత్తుమని యొడంబడి కట్టువస్త్రంబు సవరించుకొనుచు వాఁడు సహా యము చేయుచుండ నాకు౦డఁ దన రెండు చేతుల నాని యెత్తికొనినది.

పురుషసాన్నిధ్యంబునకు, గొంకుచు నప్పంకజాక్షి కుండ యెత్తుకొనునప్పు డించుక యోసరిల్లుటయు గడవయొరిగి యందున్న చల్ల సగము నేలపాలైనది. సుమేధుఁ డందులకుఁ బరితపించును గుఱ్ఱము దిగివచ్చి వానిందిట్టుచు అయ్యో! సాధ్వీ! వీఁడు తిన్నగా నెత్తకపోవుటచే నీచల్ల నేలపాలై నది మగువా! వగవకుము. దీనింబదిల ముగా నెంతయో దూరమునుండి తెచ్చుచుంటివి. నాకత౦బుననిది నేలపాలై నది కావున దీనివెల నేనిచ్చివేసెద నీకడవ కెంతి సొమ్ము వచ్చునో చెప్పుము. విచారింపకుము. అని యూరటంబలికిన విని యక్కలికి యిట్లు చదివినది.


ఉ. శ్రీపతి కప్పువెట్టు సిరిచేఁదులఁదూగెడు శెట్టిపట్టినై
    రూపునఁ బేరుపొంది యనురూపపయోగుణరూపశీల వి
    ద్యాపరిపూర్ణుఁ డాత్మహితుఁడై న మనోహరు చెట్టఁబట్టి ఘో
    రాపయశంబుజెందుచుఁ బరాంగనలం జెరఁబట్టుచున్న మా
    భూపతి జంపితి న్మగఁడు భూరిభుజంగముచేతఁ జచ్చెఁ బై
    నాపద జెందిచెంది యుదయార్కుని పట్టణమేఁగి వేశ్యనై
    పాపము గట్టికొంటి నఁటఁ బట్టి విటత్వముఁబూని రాగ సం
    తాపముఁజెంది యగ్గిఁబడి దగ్దముగాకిటు గొల్ల భామనై
    యీపని కొప్పుకొంటి నృపతీ వగ సేటికి ? చల్ల చిందినన్‌.

ఆపద్యమును విని సుమేఁధుడు హా పరమేశ్వరా! యని పలుకుచు నేలంబడి మూర్చిల్లెను. గుఱ్ఱపువాఁ డదిచూచి, అయ్యో అయ్యో గొల్ల భామా? ఏదియో చదివి మాఱేని మూర్చముంచితివి? నీ వెవ్వతెవు? తల్లీ! యుపకారము చేయఁబూనిన వానినే యిట్లు పడవేయుదువా? అని వాఁడు పలుకుచు శైత్యోపచారములు సేయఁదొడంగెను.

ఆ గొల్ల భామయుఁ దెల్ల తెల్ల పోయి జూచుచుఁ గుండదింపి బాబూ నేనేమియు నెఱుంగను. నాకే మంత్రములు తంత్రములు రావు. పాపాత్మరాలనగు నాకుపకారము సేయవచ్చి మీరాజు నేలం బడియెను. నేనేమి జేయుదునని దుఃఖించుచుఁ గుండలో మిగిలియున్న చల్ల నతని మొగమునఁ గొట్టినది.

అప్పు డించుక తెప్పరిల్లి మంధరములగు దృష్టులచే నామెంజూచుచు నారాజు గుఱ్ఱపువాని నీళ్ళుదేర దూరముగాఁ బనిచి హాహా ప్రేయసీ! ప్రేయసీ! ఎన్నినాళ్ళకుఁ గనంబడితివి. ఎట్టి యిడుమలం గుడుచుచుంటివి. అయ్యో? నీవెక్కడ ఈచల్లకుండ