పుట:కాశీమజిలీకథలు -07.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

210

కాశీమజిలీకథలు - సప్తమభాగము

మృగ - అందువలననే కాదా? ఇన్ని యిక్కట్టులు వచ్చినవి.

రాజు - ఏమి వచ్చినవి.

మృగ - గదాధరుని దృష్టితైక్ష్ణ్యము గ్రహించి సవరించుకొని మఱేమియుం గాదు దూరదేశమునుండి యిక్కడికి వచ్చుటలోనుగాఁగల ప్రయాసము.

రాజు - గదాధరుఁ నెరుఁగుదువా?

మృగ - ఎరుంగుదును. ఉ. ఉ. ఎరుఁగను.

రాజు - తబ్బిబ్బు పడుచుంటివేమి? భయములేదు. నిజము చెప్పుము. ఇంతకు ముందు వచ్చినవారిలో మృగదత్తుఁడను వాఁడుండెను వాని నెరుంగుదువా.

మృగ - గదాధరుని మొగము చూచుచున్నాడు.

రాజు - ఆదెస జూచుచున్నావు అందెవ్వరున్నారు.

మృగ - మావారున్నారు.

రాజు - వారినిట్లేదురకు రమ్మనుఁడు.

గదాధరుఁడు - ముందరికివచ్చి దేవా ! నేనీతని తండ్రికి మిత్రుఁడను. నాపేరు గదాధరుఁడు.

రాజు - వీనితో నీకెందుఁ బరిచయమైనది.

గదా - దారిలో.

రాజు - (రత్నాంగింజీరి) వీనిమాటలు వింటివా?

రత్నాంగి - (న్యాయవాది మొగముజూచుచు) వింటినిదేవా ! వింటిని. అన్నియు నసత్యములే?

న్యాయవాది - జోహారు దేవా! నాయుపన్యాస మించుక వినవలయును. ఇది యొక విచిత్రనాటకమువలె నున్నది. మొదటి యభియోగములో మృగదత్తుఁడు, గదా ధరుఁడు, కుముదాంగదుఁడు అని మువ్వురు ప్రతివాదులు వచ్చియుండిరి. వారి యపరాధముగురించి రేపు విమర్శింతుమని దేవర సెలవిచ్చియున్నారు. రెండవ మృగదత్తుఁడు మాయభియోగమున సాక్షియైయున్నాడు. విమర్శింప నతఁడు నితఁ డును నొక్కఁడే యైనట్లు తెలియఁబడుచున్నది. అట్టిశంక జేసియు దేవరయేమిటికో విరమించితిరి. వీనిమాటలలోఁ దబ్బిబ్బులుగనంబడుచున్నవి. ఇందలి నిజ మేమిదియో తెలిసికొనవలసియున్నది. మొదటి యభియోగమునందు గదాధరుఁడును అపరాధియైయున్నాడు. ఈతఁడు వాని నెరుంగుదుననియు నెరుంగననియుఁ జెప్పు చున్నాడు. అయ్యరాధుల మువ్వుర మరలఁ బిలిపింపుఁడు. ఎదురఁబెట్టి విమ ర్శింపవచ్చునని పలికిన నాసుమేధుఁడొక్కింత యాలోచించి యంతయు రేపు విమ ర్శింతుము. కాలాతీతమైనదని పలుకుచుఁ బీఠమునుండి లేచెను.