పుట:కాశీమజిలీకథలు -07.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

208

కాశీమజిలీకథలు - సప్తమభాగము

అప్పుడు న్యాయవాది లేచి దేవా! ధ్వని గ్రాహిణీయంత్రము నందలి విషయ ములు జ్ఞాపకముంచుకొనవలయును ఆసాక్ష్యమేవీడి అపరాధము ధ్రువపరచుచున్నది. సావధాన మనస్కులై చిత్తగింపవలయునని బలికిన అతండు సరే యిందు వ్రాయఁ బడియున్నదిగదా? పిమ్మట జూచెదంగాక రేపురండు. అని చెప్పి ప్రతీహారితో రత్నాంగి‌ అభియోగములో వాది ప్రతివాదులఁ బిలువుమని యాజ్ఞాపించెను. ద్వార పాలుఁడు హజారమునకుఁ బోయి పేరువరుసఁ బిలిచెను

రత్నాంగియు మఱికొందఱు సాక్షులును రాజు మ్రోలకువచ్చిరి రాజభటులు మృగదత్తుని సుమేధుసంతికమునకుఁ దీసికొనిపోయి నివేదించిరి. గదాధరుఁడును గుముదాంగదుఁడును వాని వెనుక బోయి యోరగా నిలువంబడిరి.

అప్పుడు రాజు మృగదత్తుని జాచి విస్మయము జెందుచు నొక్కింతసేపు కన్నులుమూసికొని ధ్యానించుచు మొదట వానిట్లు బ్రశ్నలువైచెను.

రాజు - మృగదత్తుడవు నీవేకాదా?

మృగ - నేనే సామి‌.

రాజు - నీతండ్రి పేరు.

మృగ - గురుదత్తుండు.

రాజు - కులము.

మృగ -- వైశ్యులము.

రాజు - వెనుక చెంచులమని చెప్పియుంటివే?

మృగ - అది దెలియక చెప్పినమాట సామి?

రత్నాంగి - వీఁడు గడియకొకపేరు చెప్పుచుండును. దేవరవారదియే పరీ క్షింపవలసిన విషయము.

రాజు - నిలు నిలు. నీవు మాటాడవలదు. నీన్యాయవాది లేడా? ఆతఁడే చెప్పును.

న్యాయవాది -- దేవా! ఇది కడువిపరితముగా నున్నదిగదా? ఇందాకవచ్చిన వాఁడును, గురుదత్తుని కొడుకుననియు దనపేరు మృగదత్తుఁడనియుఁ జెప్పికొనియె వీఁడునట్లే చెప్పుచున్న వాఁడు వీరిలో నిజమైనవాఁడెవ్వడు?

రాజు - మృగదత్తా! ఈ తివాసి యెవ్వరల్లిరి?

మృగ - నేనే సామి.

రాజు - ఈపని యెందు నేర్చుకొంటివి?

మృగ - కొండపల్లిలో నల్లియున్న యాస్తరణలం జూచి వాని విప్పిచూచి నేర్చుకొంటిని. నాకెవ్వరును జెప్పలేదు సామి.