పుట:కాశీమజిలీకథలు -07.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అపరాధవిచారణ కథ

207

రాజు - ఒండు రెండు భేదములం జెప్పుడు.

న్యాయ - మృగదత్తుని భార్య చక్కనిదఁట. సురూపుఁడును మిక్కిలి చక్కని వాడఁట ఆమె యతనిని మోహించి సాంకేతిక మేరుపరచి తనయింటికి రమ్మనినదఁట ఆ గుట్టు మృగదత్తుఁడు గ్రహించినంతదన్ను బలవంతము చేయచున్నాడని మగ నికిఁ జెప్పి చంపించినదని చెప్పుదురు. కాంతలు బొంకులకు నెలవులుగదా?

రాజు - మఱియొక విధమెట్టిది?

న్యాయ -- రాజే దానిని బలవంతపరచెనని కొందరుచెప్పుదురు. నిజము భగవం తునకుఁ దెలియును విన్నమాటగాని నేనుజూచిన మాటకాదు. ఎట్లయిన వారు రాజుం జంపినమాట వాస్తవము రాజద్రోహాపరాధము వారి నెత్తిపై నున్నది.

రాజు - సురూపునకు సంతతిలేదా?

మృగ - లేదు. లేదు చక్రవర్తియే ప్రతినిధి నేర్పరచిరి. అదియుఁ మీయధి కారములోనే జరుగునని వినియుంటిమి.

రాజు - కానిండు. ఇందు మృగదత్తుఁడెవ్వఁడు?

న్యాయ - (ముందరికివచ్చి) నేను సామి నేను.

రాజు - నీతండ్రి పేరేమి?

మృగ - గురుదత్తుఁడు సామి.

రాజు - గదాధరుడెవ్వఁడు?

గదా - (ముందరికివచ్చి) నేను.

రాజు - కులమేమి?

గదా - బ్రాహ్మణులము?

రాజు - నీవేమి చదువుకొంటివి?

గదా - మాతండ్రి బిచ్చమెత్తికొనుటచే నాకు విద్యవచ్చినదికాదు.

రాజు - అటు నిలువుము. కుముదాంగదుఁడవు నీవేనా.

కుము - (ముందరకు వచ్చి) నేనే దేవా?

రాజు - నీయల్లుడుఁను గూతురుఁను సురూపుని జంపిరఁట నిజమేనా.

కుముదా - సురూపుఁడెవ్వఁడు బాబూ?

రాజు - మీరాజు

కుము - అదియా? నాకుఁ దెలియదు తండ్రి.

రాజు - సరే? మీరవ్వలకుఁ బొండు. రేపు విమర్శింతుము అప్పటికి రండు అని యాజ్ఞాపించెను.