పుట:కాశీమజిలీకథలు -07.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

206

కాశీమజిలీకథలు - సప్తమభాగము

జంపుదురుగాక. ఎట్లు విచారింతురో నీవు సభలోఁగూర్చుండి యాకర్ణింపుము. కాకు న్నది కాక మానదుగదా యని చెప్పిన విని వాని ధైర్యమునకు సంతసించుచు గదా ధరుఁడు సభలో నొక మూల గూర్చుండి వారివిచారణ వినుచుండెను.

దివ్యరూపసంపన్నుఁడై సుమేధుఁడు పీఠ మలంకరించెను. పార్శ్వములయందు న్యాయవాదులు సముచితాసనంబుల నుపవిష్టులైరి. యుపసభ్యులచేతను బ్రేక్షకులచేతను సభాభవనము క్రిక్కిరిసి యుండెను.

సుమేధుఁడు తొలుతగనే రామదుర్గనగరమునుండి ప్రతినిధి యంపిన యభి యోగము విచారింపఁ బ్రారంభించెను. పిలిచిన తోడనే వీరభటులు మృగదత్తగదాధర కుముదాంగదుల నెదురకుఁదీసికొనివచ్చి నిలువంబెట్టిరి. దాపునకు రమ్మని వారిని రాజు నిరూపించి చూచుచుఁ బ్రతినిధిపక్షమున వచ్చిన న్యాయవాది మొగముజూచి వీ రేమి యపరాధముజేసిరో సవిమర్శముగా వక్కాణింపుమని యడుగుటయు నతండు లేచి యిట్లు చెప్పదొడంగెను.

దేవా ! కొన్ని యేండ్లక్రిందట రామదుర్గనగరాధీశుం డగు సురూపుండను సామంతరాజును, కుముదాంగదుఁడను వైశ్యుని కూఁతురును అల్లుఁడును బలవంత ముగాఁ జంపి కుండులోఁ బారవైచి పారిబోయిరి. వారిఁబట్టికొని తీసికొనివచ్చుటకై నానాదేశములకు నాజ్ఞాపత్రికలు బంపఁబడినవి. వారిజాడ యేమియుం దెలిసినదికాదు. వారిం బట్టికొనుటకై రాజభటులు గ్రామములు దిరుగుచునే యున్నారు. ఆరహస్యము దెలిసికొనుటకై కుముదాంగదుని యింటిలో ధ్వనిగ్రాహిణియను యంత్ర మమర్పఁబడి నది.

ఈనడుమ గురుదత్తునికొడుకు మృగదత్తుఁడును స్నేహితుఁడు గదాధరుఁడు కుముదాంగదుని యింటికివచ్చి మాట్లాడికొనిరి. యంత్రమూలమున వారి మాటల తెరం గంతయుఁ దెల్లమైనది మృగదత్తుడును భార్యయు నడవులలో నెక్కడనో వసించి రహస్యముగాఁ దమవారి వారింట కనుపుచున్నారు కావున వీరు మువ్వురును శిక్షాపాత్రు లైరి. వీరిని శిక్షించుటకు మునుసా సామంతరాజునకే యధికారముండునది దేవరయే యట్టియధికారము తగ్గించిరి. దానంజేసి రాజప్రతినిధి యాయభియోగమును మనయొద్ద కనిపెను. వీరి ముగ్గురిని శిక్షింపవలయునని యాన్యాయవాదియుక్తి యక్తముగా నుపన్యసించెను.

రాజు - సురూపుడి వీరేమిటికి బలవంతముగఁ జంపిరి

న్యాయవాది - పలువురు పలువిధముగాఁ జెప్పదురు నిశ్చయమైన హేతు వెద్దియుఁ దెలియదు.