పుట:కాశీమజిలీకథలు -07.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

202

కాశీమజిలీకథలు - సప్తమభాగము



   హా విలమతులగు మనుజులు
   భావంబున ధనవిరక్తి బడయంగలరే.

ధనమునకు వశులుగానివారు లేరు మృగదత్తుని గదాధరుని గుముదాంగదుని రక్షకపురుషులు పదుగురు చుట్టునుం బరివేష్టించి గజేంద్రవాహుని యొద్దకుఁ దీసికొని పోవుచుండిరి. నడుచునప్పుడుమార్గమధ్యంబున రాజభటుల నుద్దేశించి గదాధరుఁ డిట్లు పన్యసించెను.

కింకరులారా! లోకంబున ధర్మాధర్మంబులు న్యాయాన్యాయంబులు మంచి చెడ్డలు పాపపుణ్యంబులు అని చెప్పుకొనుచుందురు పర్యాయపదంబులు వీనిభావం బొక్కటియే. ఒకప్పుడు న్యాయమన్యాయముగాఁ బరిగణింపఁబడుచుండును. వీనికిఁ బూర్వకర్మంబులు హేతుకంబులని పెద్దలు వక్కాణింతురు. తొల్లి మాండవ్యుండను మహర్షి నిరపరాధియయ్యుఁ జోరుండువోలెఁ గొరతవేయఁబడిన భారతమునందలి కథ యిందులకు నిదర్శనముగా నున్నది. దుర్మరణమునొందిన మీరాజుగారి కృత్యము లెట్టివో మీ రెఱుంగనవి కావు. పద్మినిచేసిన పని యధార్హమని మనమిక్కడ నను కొనక మానము. ప్రజలు చాటున మంచిమంచిగను చెడ్డచెడ్డఁగను చెప్పికొనకమానరు. అది యెట్టిదైనను నపరాధము విమర్శింప బ్రతినిధకి విధియైయున్నది కాని యేమియు నెఱుంగని‌ మమ్మిట్లు బాంధించుట కేవలమక్రమము. అధర్మము ఈతండు గురుదత్తుని కుమారుడని యూహించితిమి. ఆదంపతు లెందుండిరో మాకుఁదెలియదు వీడుఁమునుపే యెఱుంగఁడు జాడలంబట్టి సంబంధముగలుపుకొంటిమి ఇదిమాకుఁ బూర్వకర్మయుగాక మరియొకటికాదు సజ్జను లందరిలో నుందురు. క్రూరమృగంబులలో సైతము సాత్విక విశేషంబునంబట్టి సాధుత్వము బొడగట్టుచున్నది. గోటీశ్వరునికి మనముండై యీతం డీరీతి నిడుములగుడుచుచున్నవాఁడు దైవము నేమనఁ దగినది. వీని సిరికి మీరాజు రాజ్యమంతయుఁ బదియారవ సాలునకు సరిపడదు. అని యుపన్యసించుచు జాలివొడము నట్లు వారి మొగములు జూచుటయు వారిలో.

ఒకడు - బ్రాహ్మణుఁడా ? మేమేమి జేయగలము.

గదాధరుఁడు - మీరు జేయఁగలిగినపని మహారాజు చేయలేడు.

మరియొకడు - విడిచి పెట్టుమనియెదవా? యేమి.

ఒకడు - అట్లయిన మాశిరంబులు ఖండింపరా.

గదాధరుఁడు - అయ్యో అట్లనుటకు నేనంత మూర్ఖుఁడనను కొంటిరా? మీకృ త్యములు నేనెఱుంగనివి కావు.

వేరొకఁడు - మాకు బాధకములేనిరీతి నేదియైన నుపకారము చేయఁగలము చెప్పుడు.