పుట:కాశీమజిలీకథలు -07.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

198

కాశీమజిలీకథలు - సప్తమభాగము

పిమ్మట నొక బ్రాహ్మణుఁడు మృగదత్తునిఁ జూచి నీ వేయూరి కరుగుచుంటివని యడిగిన నతఁడు. రామదుర్గ నగర౦బునకుఁ బోవుచుంటినని యుత్తరము జెప్పెను.

బ్రాహ్మణుఁడు - రామదుర్గనగరములో నెవ్వరింటికి బోయెదవు.

మృగదత్తుఁడు - కుముదాంగదుని యింటికి.

బ్రాహ్మ - అతండు నీకుఁ జుట్టమాయేమి?

మృగ - చుట్టమే.

బ్రాహ్మ -- ఏ‌మగును?

మృగ - మాతల్లి తండ్రి.

బ్రాహ్మ -- (విస్మయముతో) మీతల్లి పేరేమి?

మృగ - నాకుఁ దెలియదు.

బ్రాహ్మ - మీ తండ్రిపేరు?

మృగ -- అదియుం దెలియదు.

బ్రాహ్మ - వారెందున్నారు?

మృగ - తెలియదు. మృతినొందిరని యొకతె చెప్పినది.

బ్రాహ్మ -- (దుఃఖముతో) వారికి నీ వెందుజనించితివి.

మృగ - నాకేమియుం దెలియదు. పోనిండు. నావృత్తాంతముతో మీకేమిపని మీరెవ్వరు?

బ్రాహ్మ - నేను మీతండ్రికి మిత్రుఁడను. మీతల్లి దండ్రుల నిమిత్తమే వెద కుచు దేశాటనము చేయుచుంటిని.

మృగ -- మీపేరు

బ్రాహ్మ - గదాధరుఁడండ్రు.

మృగ - వారెందుబోయిరి?

బ్రాహ్మ - వెల్లడింపరాదు. మెల్లగా మాట్లాడుము. మహాపతివ్రతయగు మీతల్లి రాజుం గామాపచారాపరాధంబునఁ బరిమార్చినది దానంజేసి యిరువురు కానన ములంబడి యెందోడాగిరి. అని వింటిని వారినరయుచుంటిని. బాబూ ! వారు మృతి నొందిరని నీకెవ్వరు చెప్పిరి. అని కన్నీరుగార్చుచు నడుగటయుఁ నతఁడు వేశ్య యింటిలోనున్న పరిచారిక చెప్పినదని యాకథయంతయు నెఱింగించెను. నమ్మక తోచిన పిమ్మట నామె వ్రాసియిచ్చిన యుత్తరము చూపించెను.

గదాధరుఁడాయుత్తరము చదివికొని లిపిగురుతుపట్టి అయ్యో ఈయుత్తరము వ్రాసినది పద్మిని తెలిసికొనలేకపోయెను. భర్తతో వియోగము పొందియుండవచ్చును.