పుట:కాశీమజిలీకథలు -07.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గదాధరుని కథ

197

బంపవలయును వాని వలనఁ గొన్నిసంగతులు తెలిసికొనవలసియున్నదని వ్రాయించి సుమేధుడు గజేంద్రవాహనుని ముద్రికలువైచి యుదయార్కునినొద్దకనిపెను. మఱియుఁ గొన్నిదినములు గడువిచ్చితిమి. మృగదత్తునిని వలన సాక్ష్యము తీసికొన వలసియున్నది. వాని రప్పించుట కుత్తరము లిచ్చితిమి. యప్పటికి నీవు రమ్ము, పొమ్ము. అని యెఱింగించి గడువుచెప్పి సుమేధుఁడు మృగదత్తునిరాక నరయు చుండెను ఉదయార్కుఁడు గజేంద్రవాహనుని శాసనపత్రికంజదివికొని తొందర పడుచు మృగదత్తుడు గనంబడినతోడనే పట్టుకొని తీసికొని రావలయునని చెప్పి పలువురఁ దూతల నలుమూలలకుఁ బంపెను.

అని యెఱింగించి-

129 వ మజిలీ కథ

గదాధరుని కథ


ఆహా ! విద్యయం దెట్టిమహిమయున్నది.

ఉ. విద్య నిగూఢగుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్‌
     విద్యయశస్సుభోగకరి విద్యగురుండు విదేశబంధుఁడున్‌
     విద్య విశిష్టదైవతము విద్యకుసాటిధనంబు లేదిలన్‌
     విద్య నృపాలపూజితము విద్య నెరుంగనివాఁడు మర్త్యుడే.

చదివికొనక యెంతమూర్ఖుఁడ నైతిని. నాకా యిల్లా లీమాట చెప్పక పోయినచో నేమియుం దెలియదుగదా? ఇప్పుడు చదివికొనుటచే గ్రంథములు చూచుటకు శక్య మగుచున్నది నాలుగుమాసములలోనే వ్రాయుటయుఁ జదువుటయుఁ దెలిసినది. ఆమె చీకటిలో వ్రాసిన విషయములు తెల్లమైనవి. నాతల్లిదండ్రులు మృతినొందిరఁట అందున్నవారు నాతల్లికిఁ దల్లిదండ్రులఁట ఆమెకు నావృత్తాంతమెట్లు తెలిసినదియో? ఆమె యెందుఁబోయెనో తెలయదు. ఇఁక నేను రామదుర్గనగరమునకుఁ బోవుట కర్జము. బంధువులం గలసికొనియెద అయ్యో? నన్నుఁగోయవాఁడని నిరసింతురేమో వేషము మార్చెదనని మృగదత్తుఁడొకనాఁడు తలంచుచు నార్యవేషముతో బయలుదేరి యొక మార్గంబునంబడి నడుచుచుండెను.

ధ్యానించుచుండుటచేఁ దారిలో బాషాణకంటకాదులు అతని నంతగా బాధించినవి గావు పోవంబోవ మధ్యాహ్నమునకొక గ్రామము జేరెను. అందు భోజనసదుపాయ మెందుగలుగునని యరయుచు సత్రముండుటఁ దెలిసికొని అక్కడికిఁ బోయెను. అందు నాలుగు వర్ణములవారికిని భోజనము పెట్టుచుందురు. కుడిచి కూర్చున్న