పుట:కాశీమజిలీకథలు -07.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3]

వసువుల కథ

17

అమ్మా ! కల లెట్టివో నేనెఱుంగ నివియా? ఇంత జెప్పితివి ! చాలు, చాలు. అందరు మూఢులైన నేమందును. ఆయోగసక్త తన శిరోమణి జారిపడిన, దానిం గ్రహించుటకు మా యొద్దకు వచ్చినది. ఆమండనము నాదోసిటం బడినప్పుడు కలిగిన చిహ్నమిప్పుడును గనం బడుచున్నది చూడుము. ఆమె నీ తల్లి జరాధికారముం జూచి మిక్కిలి యాశ్చర్యపడినది. దేవలోకములో ముదిమియు నాధివ్యాధులును లేవఁట దేవలోకచరిత్ర మంతయుఁ బూసఁగ్రుచ్చినట్లు చెప్పినది తానాజ్ఞ నిచ్చుదనుకఁ బెండ్లియాడవద్దని ముమ్మాటికిం జెప్పి పోయినది రోహిణీ ! లెస్సగా విమర్శించి యా మాటలు కలలో సత్యములో చెప్పమనుటయు అయ్యువతి దృష్టులు పైకి నిగుడించుచు నౌను. కొంత జరిగినట్లే తోచుచున్నదని పలికినది.

అప్పుడు రాజపత్ని పుత్రీ ! పోనిమ్ము. నీమాట సత్యమనియే నమ్మెనను నిక్కముగా నామెకు నీయెడఁ గనికరము గలిగినచో నీభర్తకు మాత్రము దేవత్వ మాపాదింపలేదా? నీవు బెండ్లి యాడినం దప్పేమి? ఆసంబంధము మిగిలెనేని అట్టి వీరుఁడు దొరకుట దుర్ఘటము. ఆకాశవచనముల నమ్మి ప్రస్తుత విభవముల విడనాడుట తగదు ఆమె గడు వెద్దియేనిఁ జెప్పిపోయినదా? లేదుగదా? యెంత కాల మిట్లుందువు? వెఱ్ఱియూహల విడువుము. ఆమె యోగసక్త. నీవు జితవతివి. మీయిద్దరి నామములకు సఖ్యము కుదిరినది వార్దక్యంబున నామెతో గలసికొందువుగాక. ఇప్పుడు వలదని బోధించిన విని జితవతి యేదియో చెప్పఁబోవు సమయంబున నొక పరిచారిక వడివడి జనుదెంచి సంతోష మభినయించుచు నిట్లనియె.

భర్తృదారికా ! నీవు నన్నాయుప్పరిగపై సంతతము వసియించి యాదేవకాంత రాక నరయుచుండు మని నియమించితివి గదా? నీయాజ్ఞ శిరంబునం బూని నేనందుఁ గాచికొనియుండ నేఁటి యుదయంబున నాఁడువచ్చిన చేడియ దగ్ధపూరితమగు నీకనక కలశంబు జేతఁబూని మన మేడమీఁదకు వచ్చి యల్లంతదవ్వున నిలువంబడి జితవతీ ! జితవతీ ! యని పిలిచినది. అప్పుడు నే నెదురుపడి దేవీ ! మా రాజ పుత్రిక యిప్పుడే క్రిందకుఁ బోయినది. వేగఁబోయి తీసికొని వచ్చెద నంతదనుక నిందు నిలువుం డని ప్రార్థించితిని. అప్పు డామె యించుక యాలోచించి యోహో ! నాకిందు మసలరాదు. పోనిమ్ము. ఈ దుగ్ధ కలశం బీచీటితోఁగూడ నారాజపుత్రిక కిమ్ము. దీన నంతయుం దెలియఁ గలదని పలుకుచు వీని నాకిచ్చి యచ్చేడియ నాకమునకు నిర్గమించినది పిమ్మటఁ బదిలముగా వీనిని మీ యొద్దకుఁ దెచ్చితి నివిగో చూడుఁడని వానికి నర్పించినది.