పుట:కాశీమజిలీకథలు -07.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

కాశీమజిలీకథలు - సప్తమభాగము

యాజ్ఞ నిచ్చుదనుకఁ బెండ్లియాడదట. పెక్కులేడికి జితవతి సంకల్పము మేము ద్రిప్పఁ జాలమని చెప్పినది.

ఆమాటవిని జితవతి రోహిణీ ! అంతరిక్షమునుండి యోగసక్త వచ్చినది. నీవు చూడలేదా? మే మిద్దరము మిద్దెపయిం గూర్చుండి పెద్దతడవు సంభాషింపలేదా? ఏమియు నెఱుఁగనట్లు చెప్పుచుంటిమేమి? నిజ మెఱింగించి మాతల్లి యుల్లము మఱలింపుమనుటయు అప్పడఁతి యిట్లనియె.

జితవతీ ! నీమాట కాదనిన నీకుఁ గోపము వచ్చును. నిజముగా యోగసక్త నీ యొద్దకు వచ్చినదనుకొంటినవా? నాఁటి చర్యలన్నియు స్వప్నగతములని సఖురాండ్రందరు నిశ్చయించిరి. మన మందరము భ్రాంతిపడి యట్లనుకొంటిమి, ఆపలుకు నమ్మి యిప్పుడు సిద్ధమైన వివాహమునకు భంగంబు గలిగింపరాదు. మనుష్యులు దేవతలెప్పుడును కాఁజాలరు. ఈదేహము విడచి దేవతాదేహముం దాల్తురు. ఇదియే నిక్కువమని పెద్దగా సుపన్యసించినది.

అప్పుడు జితవతి ముక్కుపై వ్రేలిడుకొని ఔరా ! నీవెంత భ్రాంతిపడుచుంటిని. స్వప్నమో సత్యమో తెలియక నేనిట్లు చెప్పుచుంటిననుకొంటివా? నాఁడు మనము నిద్రబోయితిమా ! జాగ్రదవస్థయందు స్వప్నము వచ్చునా? ముదితా? అది కలకాదు సత్యము సత్యము. ముమ్మాటికిని సత్యము. అట్లు జరిగితీరును నాకిప్పుడు పెండ్లి యక్కరలేదని కచ్చితముగా నుత్తరము చెప్పిన విని రాజపత్ని నవ్వుచు నిట్లనియె.

బిడ్డా ! కొన్నికలలు నిజముగా జరిగినట్లే యుండును. మొన్నటి రేయి నాకొక కలవచ్చినది వినుము. నేను దేవలోకమున కఱిగితినఁట శచీదేవి కాంతలు సేవింపఁ గొల్వుడి నారాకఁయక జూచి గద్దిదిగ్గి నాకెదురువచ్చి నాచేయి పట్టుకొని ముద్దుఁ పెట్టుకొనుచు దీసికొనిపోయి తన యర్దాసనములం గూర్చుండఁ బెట్టుకొనినది. ఇరువురు తరుణులు వింజామరల విసరుచుండిరి దేవకన్యలు నాట్యము సేయుచుండిరి. కొందరు సుందరులు వీణాగానము వెలయింపుచుండిరి. అట్టితరి యింద్రాణి ముక్తా దామ మొకటి నామెడలోవైచి విడిమిచ్చి కృపారసదృష్టుల నాపైఁ బరగింపుచు మించుఁబోడి ! నీవు ప్రతిదినము వచ్చుచుం బోవుచుండుము. నిన్ను సఖురాలిగా నెంచితినని పలుకుచు నన్ను సాగనంపినది. అంతలో మేల్కొంటి. నావైభవమంతయుఁ దలంచికొనిన నిక్కముగా జరిగినట్లే తోచుచున్నది. పుత్రీ ! నాకిపుడు స్వర్గ గమనాలాభ మెట్టిదో నీకోరికయు అట్టిదే. నీవు చిన్నదానవగుటఁ గలలు సత్యములని నమ్ముచుంటివి. మేము వానిలక్ష్యము పెట్టము నీవు చక్కగా విచారించి భ్రాంతి వదలుము. అని చెప్పినవిని తల్లికి బుత్రిక యిట్లనియె.